డబ్ల్యూహెచ్‌ఓ ఆహ్వానం అందలేదు: తైవాన్‌

4 May, 2020 12:53 IST|Sakshi

చైనా ఒత్తిళ్లకు డబ్ల్యూహెచ్‌ఓ తలొగ్గిందన్న తైవాన్‌

తైపీ:  ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెలలో నిర్వహించే సమావేశానికి తమకు ఆహ్వానం పంపలేదని తైవాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. అత్యున్నత స్థాయి హెల్త్‌ పాలసీలు రూపొందించే వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ నిర్వహించే సమావేశంలో పాల్గొనాల్సిందిగా తమ దేశ ప్రతినిధిని ఆహ్వానించలేదని పేర్కొంది. ఈ మేరకు తైవాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జోనే ఓయూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్‌ ఆహ్వానం కోసం చివరి నిమిషం వరకు తమ ప్రభుత్వం ఎదురు చూస్తునే ఉంటుందని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా డబ్ల్యూహెచ్‌ఓ తీరును తైవాన్‌ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. తైవాన్‌ తనను తాను స్వతంత్ర దేశంగా చెప్పుకొన్నప్పటికీ.. ఆ ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని చైనా వాదిస్తున్న నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ సభ్యత్వ దేశాల నుంచి తైవాన్‌ను తొలగించారు. (తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతోంది: చైనా)

ఈ క్రమంలో చైనా ఒత్తిడితోనే అంతర్జాతీయ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తైవాన్‌ ఆరోపణలు చేసింది. మహమ్మారి కరోనా విస్తరిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ నుంచి తమకు సరైన సమాచారం అందకపోవడం వల్ల ఎంతో మంది పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాకుండా చైనా గణాంకాలతో కలిపి తమ దేశపు కరోనా కేసుల సంఖ్యను డబ్ల్యూహెచ్‌ఓ ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో సోషల్‌ మీడియాలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌పై ట్రోలింగ్‌ జరిగింది. దీంతో తనను జాత్యహంకారిగా చిత్రీకరిస్తూ ప్రచారమవుతున్న అసత్యాలు తైవాన్‌లో పురుడు పోసుకుంటున్నాయంటూ ఆయన మండిపడ్డారు. చైనా సైతం తైవాన్‌ ఉద్దేశపూర్వకంగానే డబ్ల్యూహెచ్‌ఓను విమర్శల పాలు చేస్తోందని ఆరోపించింది. 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపింది. ఇక 2016లో సా యింగ్‌-వెన్‌‌ తైవాన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. (డబ్ల్యూహెచ్‌ఓ విఫలం.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు