లంకలో భారత జాలర్ల విడుదల

20 Nov, 2014 02:39 IST|Sakshi
లంకలో భారత జాలర్ల విడుదల
  • క్షమాభిక్ష ప్రసాదించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
  •  నేడు తమిళనాడుకు రాక
  • చెన్నై, సాక్షి ప్రతినిధి/కొలంబో: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళనాడు జాలర్లను శ్రీలంక ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స వారికి క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదల చేశారు. వారిని తదుపరి చర్యల కోసం జైలు అధికారులు శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికారులకు అప్పగించారు.

    రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన జాలర్లు ఎమర్సన్, పి.అగస్టస్, ఆర్.విల్సన్, కె.ప్రసాద్, జె.లంగ్లెట్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే అభియోగంపై 2011లో శ్రీలంక అరెస్ట్ చేసింది. నిందితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు అక్టోబర్ 30న కొలంబో హైకోర్టు తీర్పు చెప్పింది.

    ఇందుకు తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉరి శిక్షను రద్దు చేయాలని శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. ఈ నెల 11న శ్రీలంక సుప్రీంకోర్టులో ఉరిశిక్షపై అప్పీలు కూడా చేసింది. అలాగే శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సతో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాజపక్స అంగీకరించారు. అయితే, వారికి ఉరిశిక్ష రద్దు చేశామేగానీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు యథాతథంగా ఉందని శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ పేర్కొన్నారు.

    భారత్‌కు వారందరినీ ఖైదీలుగానే అప్పగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంక నుంచి ఐదుగురు జాలర్లను సముద్రతీర గస్తీ దళాల ద్వారా లేదా విమానంలో గురువారం సాయంత్రంలోగా తమిళనాడుకు చేరుస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ఐదుగురు జాలర్లను విడుదల చేసి, తమకు అప్పగించారని భారత హైకమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వారు భారత్‌లో శిక్షను అనుభవించే అవకాశం లేదని తెలిపాయి. వారిని త్వరలోనే భారత్ పంపిస్తామని హైకమిషన్ అధికార ప్రతినిధి తెలిపారు.
     

>
మరిన్ని వార్తలు