తమిళుల గౌరవం కాపాడాలి!

14 Mar, 2015 02:04 IST|Sakshi
  • శ్రీలంక ప్రభుత్వానికి మోదీ విజ్ఞప్తి
  • లంక అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ
  • పార్లమెంట్లో ప్రసంగం; అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు
  • లంకతో నాలుగు ఒప్పందాలు
  • కొలంబో: శాంతి, సౌభ్రాతృత్వాల దిశగా సాగుతున్న శ్రీలంక నూతన ప్రస్థానంలో.. దేశంలోని తమిళులకు గౌరవం, శాంతి, న్యాయం, సమానత్వాలతో కూడిన జీవితం లభించాలన్న సందేశంతో భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం శ్రీలంక  పర్యటనకు శ్రీకారం చుట్టారు. శ్రీలంక ఐక్యత, సమగ్రత భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేసిన ప్రధాని.. లంక అభివృద్ధికి సాధ్యమైనంత సాయమందించేందుకు సిద్ధమని స్నేహ హస్తం చాచారు. పొరుగుదేశంగా, మిత్రుడిగా ఇది భారత్ బాధ్యతన్నారు. ప్రతినిధుల చర్చల సందర్భంగా లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మోదీల మధ్య భేటీ జరిగింది.  

    ఇరుదేశాల మధ్య వీసా నిబంధనల సరళీకరణ సహా 4 ఒప్పందాలు కుదిరాయి. అనంతరం సిరిసేన, మోదీవిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి, ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది. తమిళులు కోరుతున్న సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం సహా దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు తీరే దిశగా ఐక్య లంక భవిష్యత్ నిర్మాణం జరగాలని భారత్ కోరుకుంటోంది.

    అందుకు త్వరగా 13వ రాజ్యాంగ సవరణ సంపూర్ణంగా అమలు కావాల్సిన అవసరం ఉంది’ అని మోదీ  పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా, ఇరుదేశాల్లో వేరువేరు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు బలహీనమయ్యాయని, ఆ కారణంగానే భారత ప్రధాని లంక పర్యటనకు రావడానికి 28 ఏళ్లు పట్టిందని సిరిసేన అన్నారు. మోదీ శ్రీలంక పర్యటనకు రావడం తమ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.   
     
    జాలర్ల సమస్యపై..రెండు దేశాల మధ్య చాన్నాళ్లుగా నలుగుతున్న జాలర్ల సమస్య సిరిసేన, మోదీల మధ్య చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ‘రెండు వైపులా ఉన్న జాలర్ల జీవనోపాధి అంశం ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల మానవతాకోణంలో దీనికి శాశ్వత పరిష్కారం వెతకాలి. దేశాల జాలర్ల సంఘాల ఒక పరిష్కారాన్ని సూచించాలి’ అని మోదీ సూచించారు. శ్రీలంక జలాల్లోకి వచ్చిన భారత జాలర్లను కాల్చేస్తామని లంక ప్రధాని విక్రమసింఘే ఇటీవల హెచ్చరించడం, దాన్ని భారత్ ఖండించడం తెలిసిందే.
     
    లంక పార్లమెంట్లో ప్రసంగం.. శ్రీలంక పార్లమెంటునుద్దేశించి చేసిన ప్రసంగంలో.. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు లంక కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ ప్రశంసించారు. ‘ఎల్టీటీఈతో పోరులో 30 ఏళ్ల హింసను ఎదుర్కొని, గెలిచారు. అన్ని వర్గాల ప్రజల గాయాలను మాన్పి, వారి హృదయాలను గెల్చుకునే చరిత్రాత్మక అవకాశం  మీ ముందుంది. ప్రజల  ఆకాంక్షలను తీర్చే దిశగా కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసిస్తున్నా’ అని ఎంపీల హర్షధ్వానాల మధ్య  పేర్కొన్నారు. ఇరుదేశాల రక్షణకు, అభివృద్ధికి, హిందూ మహాసముద్రం కీలకమన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదాలను నిరోధించే దిశగా భారత్, శ్రీలంక, మాల్దీవులు తీరగస్తీలో పరస్పరం సహకరించుకోవాలని, ఇతర సంబంధిత దేశాలనూ ఇందులో భాగస్వామ్యులను చేసుకోవాలన్నారు. లంక పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన నాలుగో ప్రధాని మోదీనే. మోదీ పర్యటన సందర్భంగా 86మంది భారత జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.
     
    మోదీతోపాటు జాఫ్నాకు
    ఒకప్పటి యుద్ధ క్షేత్రం ఉత్తర లంక పర్యటనలో మోదీకి తోడుగా ఆ దేశాధ్యక్షుడు సిరిసేన, ప్రధాని విక్రమసింఘే వెళ్తున్నారు. తమిళులు అధికంగా ఉన్న జాఫ్నాకు మోదీతో పాటు విక్రమసింఘే వెళ్తారు.
     
    లంక పార్లమెంటులో మోదీ చేసిన ప్రకటనలు
     
    సింహళ, తమిళ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 14 నుంచి లంక ప్రజలకు భారత్ పర్యటనకు గానూ ‘టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్- ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్’ సౌలభ్యం.
     
     న్యూఢిల్లీ-కొలంబోల మధ్య ఎయిరిండియా డెరైక్ట్ విమాన సర్వీసు
     
     లంకలో రామాయణ ఇతిహాస ఆనవాళ్లను గుర్తింపునకు సాయం
     
     బౌద్ధం ప్రభవిల్లింది నిజానికి శ్రీలంకలోనే. అందువల్ల త్వరలోనే భారత్‌లో ఒక బౌద్ధ కేంద్రం ఏర్పాటు
     
     ఈ సంవత్సరం భారత్‌లో ‘ఇండియా-శ్రీలంక ఫెస్టివల్’ నిర్వహణ
     
     రుహాన వర్సిటీలో రవీంద్రనాథ్ టాగోర్ ఆడిటోరియం నిర్మాణం
     
    మోదీ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు..

     
    ట్రింకోమలీని పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) అనుబంధ సంస్థ లంక ఐఓసీ, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ల మధ్య అంగీకారం. ఆర్‌బీఐ, లంక సెంట్రల్ బ్యాంకుల మధ్య రూ. 9500 కోట్ల కరెన్సీ మార్పిడి ఒప్పందం. లంక రైల్వేకు రూ. 2వేల కోట్ల రుణం. వీసా నిబంధనల సరళీకరణ.

>
మరిన్ని వార్తలు