బుర్ఖాపై నిషేధం; అందరూ మీలాగా అనుకోరు!

1 May, 2019 11:02 IST|Sakshi

కొలంబో : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్‌ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈమేరకు ఆదేశాలు జారీచేయగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తప్పుపడుతుండగా...బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మాత్రం స్వాగతించారు.

ఈ మేరకు... ‘ బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలకం బుర్ఖాలను నిషేధించింది. చాలా మంచి నిర్ణయం. దీని ద్వారా మహిళలు తాము కూడా మనుషులమేనని భావిస్తారు. మొబైల్‌ ప్రిజన్‌(ముసుగులో ఉన్న కారణంగా ఎక్కడ ఉన్నా జైలు ఉన్నట్లుగా అనే ఉద్దేశంలో) నుంచి బయపడేందుకు వారు’ అర్హులు అంటూ తస్లిమా ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘ మొబైల్‌ ప్రిజన్‌ అనే ఒకే ఒక్కమాటతో ఈ విషయాన్ని అత్యద్భుతంగా వర్ణించారు అని కొందరు కామెంట్‌ చేస్తూ.. భారత్‌తో పాటు పలు ముస్లిం దేశాలలో ఇలాంటి నిబంధన రావాలని కోరుకుంటుండగా.. మరికొందరు మాత్రం.. ‘అందరూ మీ లాగే బుర్ఖాను జైలులా భావించారు. దయచేసి మీ అభిప్రాయాన్ని ముస్లిం మహిళలందరికీ ఆపాదించకండి. కేవలం ముస్లిం కమ్యూనిటీలోనే కాదు హిందూ మతంలో కూడా రాజస్తాన్‌ వంటి చోట్ల పర్దా పద్ధతి ఉంది’ అంటూ తస్లిమాను ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు