జెండర్‌ను మార్చుకునే కొత్త చట్టం

5 Apr, 2019 22:18 IST|Sakshi

టాస్మానియా దేశం లింగ వివక్షను రూపుమాపడానికి కొత్త చట్టం తెస్తోంది. ఇకపై ఆ దేశంలో పదహారు సంవత్సరాలు దాటిన ట్రాన్స్‌జెండర్లు ఎవ్వరి అనుమతి లేకుండా తమ జెండర్‌ను మార్చుకోవచ్చు. అలాగే జనన ధృవీకరణ పత్రాలపై, వివాహం చేసుకునేటప్పుడు‌, చివరికి డెత్‌ సర్టిఫికెట్‌లో కూడా తమ జెండర్‌ను చట్టబద్దంగా నమోదు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఈ మేరకు ముర్కిసన్‌ స్వతంత్ర ఎమ్మెల్సీ రూత్‌ ఫారెస్ట్‌ ప్రవేశ పెట్టిన బిల్లును ఎగువ సభ ఆమోదించగా, వచ్చేవారం నుంచి అధికారికంగా అమలు కాబోతోంది. ఒకవేళ పదహారు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి జెండర్‌ను మార్చాలనుకుంటే అందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి అవసరం. ఇందుకు వారు కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

అలాగే జీవిత భాగస్వాములుగా మారిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల మధ్య విడాకులు తీసుకోవడానికి ముందు తమ తమ బర్త్‌ సర్టిఫికేట్లపై లింగ మార్పిడికి వీలుండదు.  అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా లింగ వివక్ష, హోమోసెక్సువల్‌ గురించిన అసభ్యకర భాషను కూడా నిషేధించారు. ‘ఈ చట్టం వల్ల మా దేశంలో ఎలాంటి లింగ వివక్ష లేకుండా అందరూ సమానమే’నన్న భావన పెరుగుతుందని ఈ బిల్లు పెట్టిన రూత్‌ ఫారెస్ట్‌ అన్నారు.

మరిన్ని వార్తలు