ఐఏఎస్‌లకన్నా టీచర్లకే జీతాలెక్కువ!

30 Jun, 2019 07:51 IST|Sakshi

భూటాన్‌ ప్రభుత్వం నూతన వేతన సవరణలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రధాని లియోంచన్‌ లొటే సెరింగ్‌ నాయకత్వంలో వేతన సవరణపై ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో దేశంలో ఉపాధ్యాయులు, వైద్యుల వేతనాలు సివిల్‌ సర్వీసు ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువవుతాయి. ఇంతకుముందు ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాని సెరింగ్‌... తాజాగా విద్య, వైద్య సిబ్బంది వేతనాలను భారీగా పెంచారని భూటాన్‌ మీడియా వెల్లడించింది.

తాజా పెంపు ప్రకారం పదేళ్లకన్నా తక్కువ అనుభవం ఉన్న టీచర్లకు 35 శాతం వృత్తి భత్యం ఇస్తారు. 10–20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 45 శాతం, 20 ఏళ్లకు మించి సర్వీసు ఉన్న వారికి 55 శాతం వృత్తి భత్యం చెల్లిస్తారు. దీంతోపాటు భూటాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వృత్తిపరమైన ప్రమాణాల మేరకు వీరికి అనుభవాన్నిబట్టి 10 నుంచి 20 శాతం భత్యం అదనంగా లభిస్తుంది. అలాగే ఎంబీబీఎస్‌ డాక్టర్లకు 45 శాతం, స్పెషలిస్టులకు 55 నుంచి 60 శాతం వృత్తి భత్యం ఇస్తారు. నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుభవాన్నిబట్టి 35 నుంచి 55 శాతం భత్యం లభిస్తుంది.

దీని ప్రకారం లెక్కేస్తే... పదేళ్ల అనుభవం ఉన్న టీచరు, పీ5 గ్రేడ్‌ డాక్టర్‌కు 29,935 గల్‌ట్రమ్‌ (ఎన్‌యూ–భూటాన్‌ కరెన్సీ) కంటే ఎక్కువ జీతం వస్తుంది. పీ3 సివిల్‌ సర్వీసు అధికారి జీతం 28,315 గల్‌ట్రమ్‌. ప్రభుత్వంలో డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఐఏఎస్‌కు 44,120 ఎన్‌యూ వేతనం ఉంటే పీ2 గ్రేడ్‌ టీచర్, డాక్టర్ల జీతం 46,835 ఎన్‌యూలకుపైగా ఉంటుంది. భూటాన్‌ ప్రభుత్వంలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగం కేబినెట్‌ సెక్రటరీ. ఆయనకు 82 వేలకుపైగా జీతం వస్తుంది. తాజా వేతన సరవణలో ఈఎస్‌1 గ్రేడ్‌ పొందిన డాక్టర్లు 90 వేలకుపైగా జీతం పొందుతారు.

మరిన్ని వార్తలు