పిల్లాడిని పడేసినందుకు 15 ఏళ్ల జైలు శిక్ష

26 Jun, 2020 19:16 IST|Sakshi

లండన్‌: ఆరేళ్ల పిల్లవాడిని అన్యాయంగా వంద అడుగుల పై నుంచి కింద పడేసి, పగలబడి నవ్విన 18 ఏళ్ల యువకుడికి లండన్‌ కోర్టు శుక్రవారం 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ‘అదేంటి మా పిల్లవాడిని అలా పడేస్తున్నావు నీకేమైనా పిచ్చా?’ అంటూ ఆ ఆరేళ్ల పిల్లవాడు అడ్డు పడబోతుంటే ‘అవును నాకు పిచ్చే. టీవీలో నేను కనబడాలని పిచ్చి’ అంటూ 18 ఏళ్ల జాంటీ బ్రేవరి, సినిమాలో విలన్‌లా పగలబడి నవ్వాడట. 2019, ఆగస్ట్‌ 4వ తేదీన జరిగిన ఈ సంఘటనపై లండన్‌లోని ఓల్డ్‌ బెయిలీ జడ్జి జస్టిస్‌ మాక్‌గోవన్‌ నేడు తీర్పు చెప్పారు.

పర్యాటక ప్రాంతమైన లండన్‌లోని ‘టేట్‌ మోడ్రన్‌ వ్యూయింగ్‌ గాంట్రీ’లో నిలబడిన ఫ్రాన్స్‌కు చెందిన ఆరేళ్ల బాలుడి వద్దకు జాంటి బ్రేవరి వెళ్లి అతన్ని అమాంతంగా పైకెత్తి రేలింగ్‌ పై నుంచి వంద అడుగుల కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికాడుగానీ, శరీరంలో పలు ఎముకలు విరగడంతోపాటు మెదడుకు గాయమైంది. ప్రస్తుతం ఆ పిల్లవాడు వీల్‌ చేర్‌కు పరిమితం అయ్యాడు. అతడు కోలుకొని నడవడానికి మరో రెండేళ్లు పడుతుందని వైద్యులు తెలిపారు. పిల్లవాడు పడుతున్న బాధను, ఆ పిల్లవాడికి జరిగిన దారుణానికి తల్లడిల్లుతున్న వారి తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకోని దోషికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి తెలిపారు. (‘అండర్‌వేర్‌ వేసుకోను.. మాస్క్‌ ధరించను’)

పిల్లవాడిని కిందకు పడేస్తోన్న సీసీటీవీ ఫుటేజ్‌లను కోర్టులో చూపించాల్సిన అవసరం లేదని, అలాగే టీవీలలో చూపించరాదని జడ్జి అధికారులను ఆదేశించారు. టీవీలో తాను కనిపించడం కోసమే తాను అలా చేశానన్న నేరస్థుడి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని జడ్జి ఈ ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే)

మరిన్ని వార్తలు