చికాగోలో తెలంగాణ అవతరణ దినోత్సవం

13 Jun, 2017 15:22 IST|Sakshi
చికాగోలో తెలంగాణ అవతరణ దినోత్సవం

చికాగో: పదిహేను నెలల క్రితం పురుడు పోసుకున్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఏటీఏ) చికాగో మహా నగరంలోని  స్థానిక రామదా ఇన్  బాంకెట్స్ హాల్లో అధికారికంగా మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాలను  ఘనంగా జరుపుకుంది. ఇందులో ఆమెరికా నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి  పైగా సంఘ సభ్యులు, పలు తెలంగాణ సంఘ సభ్యులు, చికాగో నివాసులు పాల్గొన్నారు.  

ఈ సమావేశాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపక పితామహుడు శ్రీ మాధవ రెడ్డి బొబ్బిలి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంతాపము తెలిపి నివాళులు అర్పించారు. మొదటగా అధ్యక్షులు రామ్మోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, తోటి కార్యవర్గ సభ్యులు  గత సంవత్సరము  ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించడానికి సహకరినించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణ సంస్కృతిని/పండుగలను బావి తరాలకు చాటి చెప్పే కొన్ని కార్యక్రమాలను రూపొందించుకొని ప్రతిఏట ప్రపంచ నలుమూలాల నిర్వహించాలని సూచించారు. తరువాత సత్య కందిమళ్ల గారు మాట్లాడుతూ సంఘంలో అందరు కలిసికట్టుగా పని చేయాలనీ, కన్వెన్షన్ తో పాటు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా అన్ని నగరాలలో  నిర్వహించాలని పిలుపునిచ్చారు.
 
ప్రస్తుత కార్యదర్శి రవి ఉపాధ్యాయ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో మరియు నూతన అధ్యక్షులు సత్య కందిమళ్ల గార్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులు అందరు ఏకగ్రీవంగా కార్యదర్శిగా విష్ణు మాధవరం , కోశాధికారిగా ప్రతాప్ చింతలపని , సహాయ  కార్యదర్శిగా రఘు మరిపెద్ది , సహాయ కోశాధికారిగా మహీధర్ రెడ్డి , 2019-20 అధ్యక్షులుగా వినోద్ కుకునూర్ , చైర్మన్ గా కరుణాకర్ మాధవరంను ఎన్నుకున్నారు. 2018 జూన్ 29 , 30 , జులై 1  జరుపుకునే రెండవ ప్రపంచ తెలంగాణ మహా సభలను మూడు నగరాలను పరిశీలించి చివరగా  టెక్సాస్ రాష్ట్రములోని హౌస్టన్ నగరములో జరుపుకోవాడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. దానికి కన్వీనర్ గా బంగారు రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం అట పాటలతో, నృత్య ప్రదర్శనల తో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. ప్రవీణ్ జాలిగామ గారి నేతృత్వములో తెలంగాణ పాటలతో జానపద కళాకారుడు  జనార్దన్ పన్నెల తమ పాటలతో జనాల్లో జోష్ నింపారు.  కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రవీణ్ జాలిగామ,  జానపద కళాకారుడు జనార్దన్ పన్నెలను గ్యాపికలతో  సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూరిజం అండ్ కల్చరల్ శాఖ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు.


 

మరిన్ని వార్తలు