దుబాయ్‌ వీధుల్లో దుర్భర జీవితం

5 Oct, 2018 01:36 IST|Sakshi
పార్కులే దిక్కు: షార్జా పార్కులో తెలంగాణ కార్మికులు , తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో రాష్ట్ర కార్మికులు

జరిమానా చెల్లించలేక.. ఇంటికి రాలేక..

గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల గోస

సమీపిస్తున్న క్షమాభిక్ష గడువు  

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు

విమాన టికెట్లు మాత్రమే అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

దుబాయ్‌ నుంచి జనార్దన్‌రెడ్డి :  ఎడారి దేశం దుబాయ్‌లో తెలంగాణ జిల్లాల కార్మికులు కొందరు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కల్లివెల్లి కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని ఇంటికి చేరుకోవాలంటే తమకు మొదట్లో వీసా జారీ చేసిన కంపెనీలకు వలస కార్మికులు జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించే స్థోమత లేక ఎంతో మంది కార్మికులు ఇంటికి చేరుకోలేకపోతున్నారు.

వలస కార్మికులు నివాసం ఉన్న చోట ఉండాలంటే గదికి అద్దె, భోజనానికి కొంత పైకం చెల్లించాలి. అయితే.. చేతిలో చిల్లిగవ్వ లేక బల్దియా పార్కులు, ట్రక్కుల మెకానిక్‌ షెడ్లను ఆవాసంగా మార్చుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. కొందరు కార్మికులైతే నిలచి ఉన్న ట్రక్కుల పైభాగంలో సేద తీరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఇంటికి వెళ్లడానికి ఔట్‌పాస్‌ కోసం 500 ధరమ్స్‌ నుంచి 1,000 ధరమ్స్‌ వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంది.

మన కరెన్సీలో రూ.7,500 నుంచి రూ.19 వేల వరకు అన్నమాట. కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లిస్తేనే వారికి గతంలో వీసా జారీ చేసిన కంపెనీలు ఔట్‌పాస్‌ జారీకి ఆమోదం తెలుపుతాయి. అయితే.. క్షమాభిక్ష కార్మికులకు విమాన టిక్కెట్లను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ.. కార్మికులు చెల్లించాల్సిన జరిమానా విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేక పోయింది.

నిబంధనలు సవరిస్తేనే కార్మికులకు విముక్తి
యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు జరిమానా చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం విమాన టికెట్లు ఉచితంగా పంపిణీ చేయడానికి విమానయాన సంస్థలకు చెక్కు రూపంలో చెల్లింపులు జరిపారు. అయితే.. కల్లివెల్లి కార్మికులు చెల్లించే జరిమానాలకు నగదు రూపంలో ప్రభుత్వం సహాయం అందించాల్సి ఉంది. కానీ.. నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులకు అనుమతి లేదని ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రతినిధి చిట్టిబాబు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యూఏఈలో కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సి ఉంది. గల్ఫ్‌లో పని చేసి ఇంటికి డబ్బులు పంపించాల్సింది పోయి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులు చేసి దుబాయ్‌కి ఎంతో ఆశతో వచ్చిన తాము నిరాశతో వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను సవరించి కార్మికుల తరఫున జరిమానాను చెల్లించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎండలో ఎండుతూ.. చలికి వణుకుతూ..
పార్కులు, ట్రక్కులు, షెడ్లలో తలదాచుకుంటున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పగటి పూట ఎండ వేడిమికి, రాత్రిపూట చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. కాగా.. బయట ఉంటున్న వారిపై కొందరు విదేశీ వ్యక్తులు ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన దుండగులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల వద్ద ఉన్న బ్యాగులను దుండగులు అపహరిస్తున్నారు. దీంతో కార్మికులు ఆదమరిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


వాహనాలు ఏర్పాటు చేసిన నర్సింలు
యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోవాలనుకునే కార్మికులకు మెదక్‌ జిల్లాకు చెందిన గుండేటి నర్సింలు అందించిన సహకారం ఎంతో ఉంది. ఒకప్పుడు కల్లివెల్లి కార్మికునిగా దుబాయ్‌లో పనిచేసిన నర్సింలు ఇప్పుడు ఒక కంపెనీకి యజమాని అయ్యాడు. కార్మికుల కష్టాలను గుర్తెరిగిన ఆయన.. వారి కష్టాలను తన కష్టాలుగా భావించి తన కంపెనీ వాహనాలను క్షమాభిక్ష కార్మికుల కోసం వినియోగించాడు. క్షమాభిక్ష పొందిన కార్మికులు లేబర్‌ క్యాంపుల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి నర్సింలు వాహనాలను తిప్పాడు. అంతేకాక రాయబార కార్యాలయంలో కార్మికులకు అవసరమైన సేవలను అందించాడు. కార్మికులకు ఎన్నో విధాలుగా సేవలు అందించిన నర్సింలును అందరూ అభినందిస్తున్నారు.

84 మందికి విముక్తి కలిగించాం
యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకున్న 84 మంది కార్మికులను రెండు దశల్లో ఇంటికి చేర్పించాం. కొంత మంది కార్మికులు స్వచ్ఛందంగానే ఇంటికి చేరుకున్నారు. మరికొంత మందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాం. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్‌కు విన్నవించాం. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. –కొటపాటి నర్సింహానాయుడు, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు