అగ్రరాజ్యంలో మనదే హవా..!

22 Oct, 2018 10:54 IST|Sakshi

అమెరికాలో అత్యధికంగా వేగంగా వృద్ధి చెందుతున్న భాష ‘తెలుగు’

అమెరికన్‌ థింక్‌ టాంక్‌ సర్వే రిపోర్టు

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు బాష మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లల్లో పోలిస్తే అమెరికాలో అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా తెలుగు రికార్డు సృష్టించింది. 2010-2017 మధ్య ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారు 86శాతం పెరిగారు. ఈ మేరకు అమెరికన్‌ థింక్‌ టాంక్‌ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది అమెరికాలో నాలుగు లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇది 2010లో తెలుగు మాట్లాడేవారితో పోలిస్తే రెట్టింపు అయ్యింది.

అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి పది భాషల్లో ఏడు భాషలు దక్షిణాసియాకు చెందినవి కావడం విశేషం. కాగా అమెరికాలో ఇంగ్లీష్‌ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్‌ 20 భాషల్లో మాత్రం తెలుగు స్థానం సంపాదించలేక పోయింది. విద్యా, ఉద్యోగాల కోసం భారత్‌ నుంచి అత్యధికంగా అమెరికాకే వలస వెళ్తున్న విషయం తెలిసిందే. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే. 1990 నాటి నుంచి హైదరాబాద్‌లో ఐటీ విప్లవం మొదలైన విషయం తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 700లకు పైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. అమెరికాను ఐటీ ఉద్యోగులను అత్యధికంగా సరఫరా చేస్తున్న నగరంగా హైదరాబాద్‌ పేరొందింది. అమెరికా అందిస్తోన్న హెచ్‌-1బీ వీసాల ద్వారా భారతీయులే అత్యధికంగా లబ్ధిపొందుతున్నారు. సాఫ్టవేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల కూడా మన తెలుగు తేజమే. కాగా భారత్‌లో తెలుగు బాషా నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎనిమిది కోట్లకు పైమాటే. 

మరిన్ని వార్తలు