అమెరికాలో తెలుగు వ్యక్తి హఠాన్మరణం

24 Dec, 2018 12:55 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ: గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్నారై ప్రవీణ్ తుమ్మపల్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. వర్జీనియా రాష్ట్రం వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని అల్దీ నగరంలో నివసిస్తున్న ఆయన ఈ నెల 22న ఛాతినొప్పి వస్తుందంటూ అమాంతం కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకుపోయేలోపే గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లా  పేర్వాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ వయస్సు 45 ఏళ్లు. 1990లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఆయన వాషింగ్టన్ డీసీలోని సీజీఐ ఫెడరల్ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రవీణ్‌ తుమ్మపల్లి మృతిపట్ల అమెరికాలోని తెలుగువారు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, ఇక్కడి తెలుగువారికి తీరని లోటు అని ప్రవీణ్‌ ఆప్తమిత్రుడు యుగంధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రవీణ్‌ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు నల్లగొండలో ఉన్నందున స్వదేశానికి ఆయన భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శనార్థం ప్రవీణ్‌ భౌతికకాయాన్ని బుధవారం (26న) అలెగ్జాండ్రియాలోని జెఫర్సన్‌ ఫ్యునరల్‌ చాపెల్‌లో ఉంచనున్నామని, ప్రవీణ్‌ తుమ్మపల్లి భౌతికకాయం అంత్యక్రియల నిమిత్తం గురువారం స్వదేశానికి తరలించే అవకాశం ఉందని ఆయన మిత్రులు తెలిపారు. ప్రవీణ్‌కు భార్య పావని, 10, 14 ఏళ్ల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు