అగ్రరాజ్యంలో వెలిగిపోతున్న ‘తెలుగు’

22 Oct, 2018 19:23 IST|Sakshi

వాషింగ్టన్‌ : తెలుగు భాష అంతరించి పోతుందని భాషాభిమానులంతా భయపడుతున్నారు. కానీ మన భాషకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని అమెరికన్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచమంతా ‘ఆంగ్ల జపం’ చేస్తుంటే దీనికి భిన్నంగా అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం మన తెలుగు భాష వెలిగిపోతుందంటున్నాయి సర్వేలు. అవును 2010 - 2017 మధ్యన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు 86 శాతం పెరిగినట్లు అక్కడి సర్వేలు వెల్లడించాయి. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న భాషల మీద జరిపిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న జనాలు తాము కేవలం ఆఫీసుల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడతామని.. ఇంట్లో తమ మాతృ భాషలోనే సంభాషిస్తామని వెల్లడించారట.

ఈ క్రమంలో ‘టాప్‌ 10 ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ లాంగ్వెజెస్‌ ఇన్‌ అమెరికా’ అనే లిస్ట్‌లో తెలుగు భాష స్థానం సంపాదించుకుంది. గత ఏడాది అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షలని.. 2010తో పోల్చుకుంటే ఇది రెట్టింపయ్యిందని సదరు సర్వేలు వెల్లడించాయి. ఇందుకు కారణం 1990 నుంచి ఐటీ గ్రోత్‌ పెరుగుతుండటంతో భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో డిమాండ్‌ భారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఇంజనీర్లు అమెరికా వస్తోన్నట్లు.. అందువల్లే తెలుగు మాట్లాడే వారి సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. బీబీసీ కూడా ఇది వాస్తవమేనని తేల్చింది.

ప్రస్తుతం మైక్రో సాఫ్ట్‌ సీయీవోగా పని చేస్తోన్న సత్య నాదేళ్ల, ఇండియన్‌ - అమెరికన్‌ మిస్‌ అమెరికా నినా దావులురి వంటి ప్రముఖులు తెలుగు వారే కావడం విశేషం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న సౌత్‌ ఏషియన్‌ భాషలలో హిందీ ప్రథమ స్థానంలో ఉండగా.. ఉర్దూ, గుజరాత్‌, తెలుగు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు