అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు!

31 Jan, 2019 09:33 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారం

అక్రమ వలసదారులను పట్టుకునేందుకు ఫేక్‌ వర్సిటీని సృష్టించిన అధికారులు

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 200 మంది తెలుగువారి గుర్తింపు

పలువురు అరెస్టు.. అభియోగాలు నమోదు

వాషింగ్టన్‌: అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్‌ రాష్ట్రంలో ఒక ఫేక్‌ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో  దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వీరిలో భరత్‌ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్‌ నూనె (26) (అట్లాంటా), సురేష్‌రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్‌ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్‌కుమార్‌ రామ్‌పీసా (26) (నార్త్‌ కరోలినా), సంతోష్‌రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్‌ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్‌ పత్తిపాటి (29) (డల్లాస్‌) తదితరులు ఉన్నారు. మరో 14మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. (పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్)

అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకే 2015లో డీహెచ్‌ఎస్‌.. మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌ పేరిట ఒక ఫేక్‌ వర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ వర్సిటీలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు మారుపేర్లతో అధికారులుగా రంగంలోకి దిగి.. అక్రమ వలసదారులకు అడ్మిషన్‌ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్‌ చేసుకొని వారు ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలసదారుల గుట్టు బట్టబయలైంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి హెచ్‌ 1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఉండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల విచారణలో.. నకిలీ మాస్టర్స్‌ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వెల్లడైంది.


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు