అమెరికాలో కరోనా కష్టాలు

14 Apr, 2020 01:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో భారతీయ విద్యార్థుల ఇబ్బందులు

ఇక్కట్లలో ఉన్నభారతీయ విద్యార్థుల సంఖ్య 3,00,000

ఇక్కట్లు పడుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 80,000  

రెమ్యునరేషన్‌ ఆగిన తాత్కాలిక ఉద్యోగులు 50,000  

అనధికారికంగా ఉద్యోగాలు చేసే వారికి గడ్డుకాలం

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే 40వేల మంది హెచ్‌1బీ వీసాదారులపై కంపెనీల వేటు

జూన్‌ దాకా ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు లక్షమంది ఐటీ నిపుణులకు ఉద్వాసన?

సాక్షి ప్రత్యేక ప్రతినిధి : టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ కంప్యూటర్‌ కోర్సు చదువుతున్న మాదిరెడ్డి స్వరూప అదే యూనివర్సిటీలో అసిస్టెంట్‌షిప్‌ ద్వారా నెలకు 800 డాలర్లు సంపాదిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ డల్లాస్‌లో ఎంఎస్‌ (మెకానికల్‌) కోర్సు చేస్తున్న మారుపాక రమేశ్‌ మెకానికల్‌ విభాగంలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ నెలకు 650 డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇలా సంపాదించుకుంటున్న సొమ్ముతోనే అక్కడ తాము చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చుకుంటున్నారు. గడచిన నెల రోజులుగా విశ్వవిద్యాలయాలు మూతపడటంతో వారికి అసిస్టెంట్‌షిప్‌ అందడంలేదు. స్వరూప, రమేశ్‌ మాత్రమే కాదు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న 50వేల మంది ఇప్పుడు నిరుద్యోగులయ్యారు. వీరుకాక మరో లక్షమంది విద్యార్థులు అనధికారికంగా వివిధ వాణిజ్య, వ్యాపారసంస్థల్లో రోజువారీ వేతనంపై పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌తో నెల రోజులుగా వారికి వేతనాలు రావడంలేదు. దీంతో ఇప్పుడు వారికి డబ్బులు పంపాల్సిన బాధ్యత భారత్‌లోని తల్లిదండ్రులపై పడింది.

మధ్యతరగతి తల్లిదండ్రులు ఏదోలా ఇక్కడి నుంచి తమ పిల్లలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. కానీ, అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ఎంఎస్‌ పూర్తిచేస్తామని వెళ్లిన దాదాపు లక్షమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘మేము నలుగురం డల్లాస్‌లో త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ నెలకు రూ.2,500 డాలర్లకు అద్దెకు తీసుకుని ఉంటున్నాం. వర్సిటీలో తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయాం. ఇప్పుడు ఇండియా నుంచి (తల్లిందండ్రులు) డబ్బులు పంపుతున్నారు. కానీ, మాలో ఇద్దరికి అక్కడి నుంచి డబ్బు వచ్చే ఆశ లేదు. దీంతో సాయం చేయాలని మాకు తెలిసిన వారిని అడిగాం. వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టాం. ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా టికెట్‌ డబ్బులు సంపాదించుకుని ఇండియా పోదామంటే విమానాలు లేవు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ ఎంబసీకి ఫోన్‌చేసి మా బాధలు చెప్పుకున్నాం. వారు నాలుగు ఊరడించే మాటలు చెప్పారు తప్ప సహాయం చేస్తామనలేదు’ అని నల్లగొండ జిల్లారామన్నపేటకు చెందిన దేవిరెడ్డి సృజన్‌ వాపోయాడు. గంపెడాశలతో అమెరికా వెళ్లిన వేలాదిమంది విద్యార్థులది ఇదే పరిస్థితి.

వెనక్కి పంపడం ఇప్పట్లో కష్టమే..
‘ఇప్పటికిప్పుడు అమెరికాలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో పలువురు ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోకొంత సహాయం చేయాలని ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా సాధ్యపడటంలేదు. అమెరికాలో ఉన్న భారతీయుల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారు మాత్రమే సహాయంచేసే స్థితిలో ఉంటారు. ఇప్పుడా కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. భారీగా సహాయం చేయాల్సిన స్థితిలో ఉన్న అనేకమంది భారతీయులు న్యూయార్క్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వారు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) ప్రతినిధి సుధీర్‌ చెప్పారు. అమెరికాలో కరోనా కేసులు నమోదు కావడంతోనే విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయని, చాలామంది వెళ్లిపోయారని, ఉన్నవాళ్లలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరో ప్రతినిధి బాల ఇందూర్తి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల డేటాను సేకరిస్తున్నామని, ఏ మేరకు సాయం చేయగలమనేది పరిశీలిస్తున్నామని తానా ప్రతినిధి తోటకూర ప్రసాద్‌ చెప్పారు. పెద్ద సంఖ్యలో ఉన్న మన విద్యార్థులను భారత్‌కు పంపడం ఇప్పట్లో సాధ్యపడదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం చెబుతోంది.

హెచ్‌1బీ వీసాదారులకు కష్టకాలం
అమెరికాలో లాక్‌డౌన్‌తో హెచ్‌1బీ వీసాపై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది ఉద్యోగాలు పోయాయి. వచ్చే రెండు నెలల్లో మరో 60వేల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. రానున్న రోజుల్లో అత్యంత అధునాతనమైన విమానాలు ఉత్పత్తిచేసే కార్యక్రమంలో భాగంగా బోయింగ్, ఎయిర్‌బస్సు సంస్థలు అమెరికాలోని అరడజను ఐటీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకున్నాయని, మునుముందు ఉద్యోగాలకు ఇది గడ్డుకాలమని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. హెచ్‌1బీ వీసాదారుడు ఉద్యోగం కోల్పోయినా సరే వీసా స్టేటస్‌ కొనసాగించాలంటే ఫెడరల్‌ ప్రభుత్వానికి నెలకు వెయ్యి డాలర్ల దాకా చెల్లించాలి. లేకపోతే వీసా రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొందరు ఇప్పటిదాకా తాము పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచి తీసి చెల్లిస్తున్నారు. ‘ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుందో, విమానాలు ఎప్పుడు నడుస్తాయో తెలియదు. మొత్తం మీద మా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింద’ని బోస్టన్‌లో ఉంటున్న వేమిరెడ్డి నరేందర్‌ వాపోయాడు. అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను చూస్తుంటే ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. బతికుంటే బలుసాకు తినొచ్చన్న సామెత గుర్తుకు వస్తోందని డల్లాస్‌లో ఉంటున్న కంచనపల్లి రఘుబాబు వ్యాఖ్యానించాడు. ఉద్యోగాలు ఎలాగూ పోతాయి. వాటి గురించి ఆలోచించడం కంటే స్వదేశానికి వెళ్లి ఏదో ఒక పని చేసుకోవచ్చనే ఆలోచనలో వేలాదిమంది హెచ్‌1బీ వీసాదారులు ఉన్నారు.

న్యూయార్క్, న్యూజెర్సీలో గడప దాటాలంటే భయం
‘మాకు ఇప్పుడు ఉద్యోగం గురించి ఎలాంటి ఆలోచన లేదు. సరుకుల కోసం గడప దాటాలంటేనే భయపడుతున్నాం. న్యూయార్క్‌లో సరుకుల కోసం బయటకు వెళ్లిన ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు న్యూజెర్సీలోనూ అదే భయం. ఉన్న సరుకులతోనే వెళ్లదీసుకోవడం లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడంతోనే మా జీవితం సాగిపోతోంది. ఇదెంతకాలమో తలచుకుంటే భయంగా ఉంది’అని న్యూజెర్సీలో ఉంటున్న బైరెడ్డి దేవిక చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు న్యూయార్క్‌లో 1,88,694 కేసులు నమోదు కాగా, న్యూజెర్సీలో 61,850మంది కరోన బారినపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు 11,735 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

చదవండి: అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్‌

మరిన్ని వార్తలు