హై టెన్షన్‌ : 282 విమానాలు రద్దు

30 Jan, 2018 19:36 IST|Sakshi
బీజింగ్‌-తైవాన్‌ ఏవియేషన్‌

బీజింగ్‌ : చైనా-తైవాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల ప్రయాణమార్గంపై ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. న్యూ ఇయర్‌ హాలీడే ట్రిప్‌కు తైవాన్‌ వెళ్లేందుకు ప్రయాణీకులు క్యూ కట్టారు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి.

అయినా, తైవాన్‌ వెళ్లేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సర్వీసులను నడపాలని చైనా నిర్ణయించింది. చైనాకు చెందిన చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌, గ్జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌లు 282 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక సర్వీసులను అనుమతించబోమని తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ చర్యతో చేసేదేమీ లేక చైనా విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

దీంతో లూనార్‌ న్యూ ఇయర్‌ను జాలీగా ఎంజాయ్‌ చేద్దామనుకున్న వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. కొత్త మార్గాలల్లో విమాన రాకపోకలపై చైనా తమతో చర్చించలేదని వెల్లడించింది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎమ్‌503 అనే మార్గం గుండా కూడా సర్వీసు నడుపుతామని చైనా తనంతట తనే ప్రకటించడంపై తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ మండిపడ్డారు.

చైనా మరోసారి ఇలాంటి దుందుడుకు చర్యకు దిగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడతాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు