ఓ డాల్ఫిన్ ఆత్మహత్యాయత్నం!

14 Sep, 2015 18:05 IST|Sakshi
ఓ డాల్ఫిన్ ఆత్మహత్యాయత్నం!

భరించరాని కష్టం ఎదురైనప్పుడో, శత్రువు చేతిలో చావకూడదనుకున్నప్పుడో కొంత మంది ఆత్మహత్యను ఆశ్రయిస్తారు. జంతువులు కూడా అలాంటి పరిస్థితిలో ఆత్మార్పణకు సిద్ధమవుతాయా?

జపాన్ ఫసిపిక్ తీరంలోని తాయ్ జి పట్టణం. అక్కడి సముద్రపాయలో వేలాది సముద్ర జీవులు నివసిస్తూఉంటాయి. జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ లాంటి తాయ్ జి తీరంలో ఏటా సెప్టెంబర్ మాసంలో డాల్ఫిన్ల వేట కొనసాగుతుంది.. అది కూడా ప్రభుత్వ అనుమతితో! మొదట సాంప్రదాయంగా మొదలై ప్రస్తుతం ఫక్తు వ్యాపారంగా మారిన డాల్ఫిన్ల వేట ఆటవిక చర్య అంటూ పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయినా వేట ఆగలేదు. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 1న  మొదలైంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 12న వేటగాళ్లకు చిక్కింది రిస్సోస్ జాతికి చెందిన ఓ యువడాల్ఫిన్..

అప్పటివరకు తన సమూహంతో సరదాగా గడిపిన ఆ డాల్ఫిన్.. వేటగాళ్లు గోడలా కట్టిన వలకు ఇవతలివైపు వచ్చి మృత్యువలలో చిక్కుకుపోయింది. తప్పించుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించి విఫలమైంది. వేటగాళ్ల చేతిలో చావడం ఇష్టం లేక ఆత్మాహత్యాయత్నం చేసింది. తీరంలోని రాళ్లకేసి తన శరీరాన్ని పదేపదే కొట్టుకుంది. ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. మరికొద్ది క్షణాల్లో డాల్ఫిన్ చనిపోతుందనగా.. మోటారు బోటులో దగ్గరకు వెళ్లిన వేటగాళ్లు దాన్ని తిరిగి నీళ్లలోకి చేర్చారు. అలాగని వాళ్లు దాన్ని కనికరించినట్లు కాదు.. డాల్ఫిన్ ను సజీవంగా పట్టుకుని అక్వేరియం వాళ్లకిస్తే బోలెడు డబ్బులొస్తాయని.

ఇక ఈ డాల్ఫిన్ సజీవంగా దొరికే అవకాశం లేదని నిర్ధారించుకున్నాక.. దాన్ని చంపాలనే నిర్ణయానికి వచ్చారు. పదునైన ఖడ్గంతో నీళ్లలోకి డైవ్ చేశాడో వేటగాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో చాలా మందిని ఆకర్షిస్తున్నది.

తెలివితేటలతో వ్యవహరించడంలో చింపాంజీ, కోతుల తర్వాతి స్థానం డాల్ఫిన్లదేనని శాస్త్రజ్ఞులు చెబుతారు. మనుషుల్లా అవీ క్షీరదాలే. మనం పెంచినట్లే డాల్ఫిన్లు కూడా పిల్లల్ని అల్లారముద్దుగా పెంచుతాయి. మెదడు కూడా పెద్ద సైజులో ఉంటుంది. అవి కూడా సంక్లిష్టతతో కూడిన సంఘ జీవితాన్నే ఫాలోఅవుతాయి. మనం మాట్లాడినట్లే అవి విజిల్స్ చప్పుళ్లతో సంభాషించుకుంటాయి. జంటను ఆకర్షించడానికి అందంగా, హుందాగా నడుచుకుంటాయి. మనుషులతో ఇన్ని పోలికలున్న డాల్ఫిన్లు ఆత్మహత్యలు చేసుకోవడం విడ్డూరమేమీ కాదని కొందరి వాదన.

తాయ్ జీ తీరంలో డాల్ఫిన్ల వేటను నిరసిస్తూ అమెరికాకు చెందిన రిక్ ఓబెరీ రూపొందిచిన 'ది కోవ్' అనే డాక్యూమెంటరీ సినిమాకు 2009తో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు లభించింది. చిన్నప్పటినుంచి డాల్ఫిన్లను ప్రేమించే రిక్.. వాటి సంరక్షణ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని నడుపుతున్నాడు.

మరిన్ని వార్తలు