ఐరోపా బడ్జెట్‌కు టెర్రర్ ముప్పు

2 Feb, 2016 00:03 IST|Sakshi
ఐరోపా బడ్జెట్‌కు టెర్రర్ ముప్పు

పారిస్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐరోపా దేశాలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకునేందుకు 2010 సంవత్సరం నుంచి పొదుపు చర్యలు పాటిస్తున్న విశయం తెల్సిందే. ముఖ్యంగా రక్షణ శాఖకు కేటాయిస్తున్న బడ్జెట్‌ను భారీగా తగ్తిస్తూ వచ్చాయి. రక్షణ శాఖ కేటాయింపులు మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతానికి మించి ఉండకూడదంటూ ఐరోపా కూటమి సూచించిన మార్గదర్శకాలను సభ్య దేశాలు తూచాతప్పక పాటిస్తున్నాయి కూడా. ఇందులో భాగంగా ఫ్రాన్స్ సహా అన్ని ఐరోపా దేశాలు యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను భారీగా కుదించుకోవడమే కాకుండా సిబ్బంది నియామకాల్లో కూడా భారీగా కోత విధించాయి. గత నవంబర్ నెలలో పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడి 130 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడంతో హఠాత్తుగా సీన్ మారిపోయింది.

 ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులను సమూలంగా నిర్మించేందుకు ఫ్రాన్స్ నాయకత్వాన ఐరోపా దేశాలు దాడులు తీవ్రతరం చేయాలని ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో మళ్లీ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లు హఠాత్తుగా పెరిగిపోయాయి. సైన్యానికి చెందిన అన్ని విభాగాల్లో సిబ్బందిని రెట్టింపు చేస్తున్నాయి. దీంతో పొదుపు చర్యల మాట అప్రస్తుతంగా మారిపోయాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకుల సందడి తప్పించి భద్రతా సిబ్బంది హడావిడిగా పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు పదివేల మంది సైనిక సిబ్బంది రక్షణ కవచాలు ధరించి, అత్యాధునిక మిషన్ గన్లు చేబూని ఈఫిల్ టవర్‌తోపాటు నగరంలోని అన్ని చారిత్రిక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు, పర్యాటక స్థలాలు, మాల్స్ వద్ద గస్తీ తిరుగుతున్నాయి. ఫ్రాన్స్ దాదాపు తన పొదుపు చర్యలను మరచిపోయింది.

 టెర్రరిజం నుంచి తమకు శాశ్వత ముప్పు పొంచి ఉందని, టెర్రరిస్ట్ లను వేటాడడం, వారి నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం, వారి ప్రచారాన్ని తిప్పికొట్టడం తమ ప్రథమ ప్రాధ్యానత అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ఇటీవలనే ప్రకటించారు. సైనిక సంపత్తికి అదనపు బడ్జెట్ కేటాయింపులు జరపుకునేందుకు తమకు ఐరోపా కూటమి నుంచి మినహాయింపు కూడా ఉన్నట్టు ఆయన చెప్పుకున్నారు. ఈ విషయాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడ్ జంకర్ కూడా ధ్రువీకరించారు. ఫ్రాన్స్ బాటలోనే బ్రిటన్, జర్మనీ దేశాలతోపాటు ఇరుగుపొరుగు దేశాలు కూడా ప్రయాణిస్తున్నాయి.

 దేశ భద్రత కోసం ఫ్రాన్స్ రోజుకు పది లక్షల యూరోలు ఖర్చు చేస్తుండగా, బ్రిటన్ ఇటీవలనే రక్షణ ఖర్చుల కోసం లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్ చేపట్టిన పొదుపు చర్యల కారణంగా ఐరోపా దేశాల ఆర్థిక బడ్జెట్‌లో రక్షణ కేటాయింపులు దాదాపు 13 శాతం తగ్గాయి. ఇప్పుడు ఐసిస్ టెర్రరిస్ట్ ల  ముప్పు కారణంగా కేటాయింపులు 20 శాతానికి పైగా పెరిగాయి. హఠాత్తుగా తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరగడంతో యుద్ధ విమానాలు, ఆయుధాల తయారీదారులు తెగ సంబరపడి పోతున్నారు. ఇప్పటికే రెండు ఆర్థిక సంక్షోభాలకు గురైన గ్రీస్ దేశం పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వలసదారుల సంక్షోభం నుంచి ఎలా భయటపడాలో తెలియక తలపట్టుకు కూర్చున్న గ్రీస్ ఇప్పుడు దేశ భద్రతాచర్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మరో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 
 
 
 
 

మరిన్ని వార్తలు