ఉగ్రవాదంపై కఠిన చర్యలు

29 Jun, 2019 03:40 IST|Sakshi
జీ20 సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ దేశాధినేతలతో ప్రధాని మోదీ

ప్రపంచ దేశాలను కోరిన బ్రిక్స్‌ కూటమి

ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్‌ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్‌ పుతిన్, సిరిల్‌ రమఫోసా, జాయిర్‌ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు.  నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు.  

ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ
మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్‌ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు.

పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ
ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్‌ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు