ఉగ్రవాదాన్ని ‘రాజద్రోహం’గా పరిగణించాలి: పాక్ మతపెద్ద

21 Mar, 2016 01:03 IST|Sakshi
ఉగ్రవాదాన్ని ‘రాజద్రోహం’గా పరిగణించాలి: పాక్ మతపెద్ద

న్యూఢిల్లీ: మత విశ్వాసాలను అడ్డంపెట్టుకొని చెలరేగే ఉగ్రవాదాన్ని తీవ్రమైన రాజద్రోహం నేరంగా పరిగణించాలని పాకిస్తాన్‌లో శక్తివంతమైన మతపెద్ద మహమ్మద్ తాహిర్ ఉల్ ఖాద్రీ చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు భారత్, పాక్‌లు గట్టి  చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో ఆదివారం అంతర్జాతీయ సూఫీ సదస్సు సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడారు. ఖాద్రీ నేతృత్వంలో ఏడాదిన్నర కిందట ఇస్లామాబాద్‌లో జరిగిన మహా ధర్నా నాడు ప్రభుత్వాన్ని వణికించింది.

సంఘ విద్రోహక శక్తులను ఎదుర్కొనేలా విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని భారత్, పాక్‌లకు ఆయన సూచించారు. తద్వారా యువత ఆయుధాలు పట్టి చెడు మార్గంలో పయనించకుండా చూడవచ్చన్నారు. ‘జైష్ ఏ మహ్మద్, లష్కరే తోయిబా, ఐసిస్ లేదంటే ఏదైనా హిందూ సంస్థ కావచ్చు. ఎవరైనా సరే... మతం చాటున ఉగ్రవాద, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

మరిన్ని వార్తలు