బ్రసెల్స్‌లో ఉగ్రదాడి

23 Mar, 2016 01:50 IST|Sakshi
బ్రసెల్స్‌లో ఉగ్రదాడి

♦ 34 మంది మృత్యువాత
♦ 200 మందికి గాయాలు
 
 బెల్జియం రాజధానిలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఐసిస్
 బ్రసెల్స్: ఉగ్రభూతం మరోసారి జడలు విప్పింది. పారిస్ దారుణం మరవకముందే యూరోప్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్ర కర్కష రక్కసులు మరోసారి రెచ్చిపోయారు. వరుస పేలుళ్లతో బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నెత్తుటేర్లు పారించారు. మంగళవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్లకు, యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం దగ్గర్లోని భూగర్భ మెట్రోస్టేషన్లో ఓ భారీ విస్ఫోటనానికి పాల్పడి 34 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ పేలుళ్లలో మరో 200 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్లలో 14 మంది, మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్ల క్షతగాత్రుల్లో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు భారతీయ ఉద్యోగులు నిధి చాపేకర్, అమిత్ మోత్వానీ ఉన్నారు.

 దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ప్రకటించింది. మరిన్ని దాడులు చేసేందుకు మరికొందరు ఉగ్రవాదులు బ్రసెల్స్ నగరంలోనే ఉండి ఉండొచ్చన్న ఆందోళన ఉందని బెల్జియం విదేశాంగమంత్రి డిడియర్ రీండర్స్ వ్యాఖ్యానించారు. నాటో, యూరోపియన్ యూనియన్ సంస్థల ప్రధాన కార్యాలయాలున్న బ్రసెల్స్‌లో జరిగిన ఈ తాజా దాడులతో ఉలిక్కిపడ్డ యూరోప్ దేశాలన్నీ భద్రతా చర్యలను తీవ్రం చేశాయి. బ్రసెల్స్‌కు రవాణా మార్గాలను మూసేశాయి. విమానాశ్రయాలు, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ భీకర  పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల అధినేతలు.. బెల్జియంకు సంఘీభావం తెలుపుతూ, ఉగ్రవాదంపై పోరును తీవ్రం చేస్తామని పునరుద్ఘాటించారు. ఉగ్రదాడులను పిరికి చర్యగా అభివర్ణించిన బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్.. దేశానికి ఇది విషాదభరితమైన బ్లాక్ డే అన్నారు. పారిస్ దాడుల సూత్రధారి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ కీలక నేత సలాహ్ అబ్దెస్లామ్‌ను బ్రసెల్స్ శివార్లలో అరెస్ట్ చేసిన వారంలోపే ఈ దాడులు జరిగాయి. బ్రసెల్స్‌లో కూడా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు అబ్దెస్లామ్ విచారణలో అంగీకరించారని రీండర్స్ వెల్లడించారు. ‘ఉగ్రదాడుల గురించి భయపడుతూనే ఉన్నాం’ అని  బెల్జియం పీఎం చార్లెస్ వ్యాఖ్యానించారు.

 భయానకం.. బీభత్సం..
 రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్ల అనంతరం జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మెయిన్ హాల్‌లో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్తపు మడుగుల్లో  చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, తెగిపోయిన శరీరావయవాలతో క్షతగాత్రులు, భయవిహ్వలతతో పరగులు తీస్తున్న ప్రయాణీకులు, పేలుడు ధాటికి ఊడిపడిన సీలింగ్, పగిలిపోయి, చెల్లాచెదురుగా పడిన గ్లాస్ డోర్స్ ముక్కలు, భారీగా కమ్ముకున్న పొగ, గన్‌పౌడర్ వాసనతో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఈ దాడిలో ఒక ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘అరబిక్ భాషలో గట్టిగా రెండుమూడు అరుపులు వినిపించాయి. కాల్పుల శబ్దాలు వినిపించాయి.

అనంతరం చెవులు చిల్లులు పడేలా భారీ విస్ఫోటనం జరిగింది. పేలుళ్లలో చాలామంది చేతులు, కాళ్లు తెగిపోయాయి. ఒక వ్యక్తి రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి’ అని ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ను చెక్‌చేసే భద్రతాధికారి అల్ఫాన్సో ల్యూరా తెలిపారు. దాడుల అనంతరం ఒక అనుమానాస్పద బ్యాగ్‌ను ఆర్మీ అధికారులు పేల్చేశారు. వారికి ఆత్మాహుతికి ఉపయోగించే పేలుడు పదార్థాలున్న షర్ట్ కూడా లభించిందని స్థానిక మీడియా పేర్కొంది. విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లలో 14 మంది చనిపోగా, 96 మంది గాయాల పాలయ్యారు. మాల్‌బీక్ సబ్‌వే మెట్రో స్టేషన్లో ఉదయం రద్దీ సమయంలో చోటు చేసుకున్న భారీ పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 106 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విధులకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పేలుడు జరగడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉంది.

 నిలిచిపోయిన రవాణా: ఉగ్ర దాడుల నేపథ్యంలో జావెంటమ్ విమానాశ్రయాన్ని మూసేశారు. ఇతర విమానాశ్రయాల్లోనూ సర్వీసులను నిలిపేశారు. బ్రసెల్స్‌లో మెట్రో, ట్రామ్, బస్ సర్వీస్‌లను సైతం ఆపేశారు. బెల్జియంకు విమాన, రైలు సర్వీసులను యూరోప్ దేశాలు నిలిపేశాయి. లండన్, పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, ఆమ్‌స్టర్‌డామ్ సహా ప్రధాన విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెల్జియంలోని అన్ని అణు కేంద్రాలు, ప్రధాన ప్రభుత్వ భవనాల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న ఈయూ పార్లమెంట్, ఇతర ఈయూ భవనాల వద్ద భద్రతను భారీగా పెంచారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని, ఎక్కడివారక్కడే ఉండాలని, సంయమనం పాటించాలని బెల్జియం ఉప ప్రధాని అలెగ్జాండర్ డీ క్రూ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి.. అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి, నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెంచొద్దని సూచించారు. బదులుగా, ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవాలన్నారు. బెల్జియంలో ఉగ్రవాద హెచ్చరిక స్థాయిని 3 నుంచి నాలుగు(అత్యున్నత స్థాయి)కు పెంచినట్లు హోంమంత్రి జాన్ జాంబాన్ వెల్లడించారు.
 
 పారిస్ దాడుల సూత్రధారి అరెస్ట్ కాగానే!
 గత నవంబర్‌లో పారిస్‌పై భీకర దాడుల ప్రధాన నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్‌ను గత శుక్రవారం బ్రసెల్స్ శివార్లలోని మెలెన్‌బీక్‌లో, ఆయన కుటుంబం నివసిస్తున్న ఇంటికి దగ్గరలో బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్ దాడుల అనంతరం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా యూరోప్ దేశాలు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లోని ఓ జైలులో ఉన్నాడు. బ్రసెల్స్‌లో దాడులకు సైతం కుట్ర పన్నినటు విచారణలో అబ్దెస్లామ్ అంగీకరించారు.
 
 అనుమానితుల ఫొటోల విడుదల
 విమానాశ్రయంలో దాడికి సంబంధించి ముగ్గురు అనుమానితుల సీసీటీవీ ఫోటోను పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఎడమ చేతికి గ్లౌజ్‌లు తొడుక్కుని ఉన్న ఇద్దరిని మానవబాంబులుగా అనుమానిస్తున్నారు. గ్లౌజ్‌ల వెనుక ట్రిగ్గర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మరొకరు గడ్డంతో, కళ్లద్దాలు పెట్టుకుని, పెద్ద బ్లాక్ బ్యాగ్ ఉన్న ట్రాలీని తోసుకుంటూ వెళ్తున్నాడు. ఇతను బాంబును విమానాశ్రయంలో వదిలి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
 
 పిరికిపందల పని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్
 ► ‘ఈ దాడి పిరికిపందల చర్య. దుర్మార్గంగా ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపైకి రావాలి’ అని బెల్జియం ప్రధాన మంత్రి చార్లెస్ మిచెల్ అన్నారు. వరుసపేలుళ్ల ఘటన, తదనంతర చర్యలను రిపోర్టు చేయకూడదంటూ బెల్జియన్ అధికారవర్గాలు మీడియాను కోరాయి. మీడియా రిపోర్టుల వల్ల విచారణకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఇలా కోరామని చెప్పాయి.
 ►  మార్చి 30 నుంచి బ్రసెల్స్‌లో జరిగే ప్రధాని పర్యటలో మార్పులేదని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు. కాగా ఈ ఘటనలో భారతీయులెవరూ గాయపడలేదని ప్రభుత్వం తెలపగా.. తమ సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయని జెట్ ఎయిర్‌వేస్ ప్రటించింది.
 ► బెల్జియం విమానాశ్రయంపై ఉగ్రదాడి దాడిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉగ్రవాదు పిరికిపంద చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.
 ► బ్రసెల్స్ ఘటనతో బెల్జియం సరిహద్దుదేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఫ్రాన్స్‌లో గతేడాది జరిగిన ఘటనకు ఉగ్ర లింకులు బెల్జియంలోనే బయటపడటంతో.. అదనంగా 1600 మంది భద్రతాబలగాలను సరిహద్దుకు తరలించింది.
 ► బెల్జియంపై దాడిని యురోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ‘అమాయకు లప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులు పిరికిపందలు’ అని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ అన్నారు.
 ► మంగళవారం నాటి ఉగ్రదాడి కేవలం బెల్జియంపై జరిగింది కాదని.. మొత్తం యూరప్‌పై దాడిగా దీన్ని పరిగణిస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఉగ్రవాదులపై తమ పోరు కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
 ► ఉగ్రదాడితో షాక్‌కు గురైనట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. బెల్జియం కోలుకునేందుకు అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 ► బెల్జియం ఎయిర్‌పోర్టులో ఉగ్ర ఘటనతో.. భారత్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో ప్రత్యేక భద్రత కల్పించారు.
 ► బ్రసెల్స్ విమానాశ్రయంలో తన భార్య, కుమారుడు చిక్కుకుపోయారని బాలీవుడ్ సింగర్ అభిజిత్ తెలిపారు. ఘటన జరిగే సమయానికి వారిద్దరూ న్యూయార్క్ వెళ్లాల్సిన జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణిలకులతోపాటు వీరిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు.
 ► అమెరికా అధ్యక్ష ఎనికల రేసులో ముందజంలో ఉన్న డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు కూడా బ్రసెల్స్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
 బ్రసెల్స్ ఘటనలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఏకం అవ్వాలి.    
 - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
 
 బ్రసెల్స్ ఘటన ఆందోళనకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.     
 - ప్రధాన మంత్రి మోదీ
 
 జాతి, ప్రాంతం, మతాలకు అతీతంగా మనమంతా ఉగ్రవాదంపై పోరు జరపాలి. ప్రపంచ భద్రతకు ముప్పుగా పరిణమించిన వారిని అంతం చేయకతప్పదు. ఇందుకు అమెరికా తన శక్తిమేర సాయం చేస్తుంది.
 - అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

మరిన్ని వార్తలు