పాక్‌లో ఉగ్ర దాడి

26 Oct, 2016 07:25 IST|Sakshi
పాక్‌లో ఉగ్ర దాడి

61 మంది మృతి.. 165 మందికి గాయాలు
- క్వెట్టా  పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఐసిస్ ఘాతుకం
 
ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో మరోసారి పంజా విసిరారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణా కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం.. ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 61 మంది యువ క్యాడెట్లు ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు.
 
 నిద్రిస్తున్న వారిపై కాల్పులు, ఆత్మాహుతి దాడులు

 క్వెట్టా: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో పంజా విసిరారు. బలూచిస్తాన్  రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణ కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం.. ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 61 మంది యువ క్యాడెట్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 165 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల పాక్‌లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు చెపుతున్నారు. క్వెట్టాలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో సుమారు 700 మంది క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. వీరంతా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వారే. 

సోమవారం రాత్రి ఆయుధాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు కాలేజీలోకి ప్రవేశించారు. తొలుత వాచ్‌టవర్ వద్ద ఉన్న పోలీస్ గార్డ్‌ను కాల్చిచంపి కాలేజీ క్యాడెట్ల విశ్రాంతి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.నిద్రిస్తున్న క్యాడెట్లపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు క్వార్టర్స్ పైనుంచి కిందికి దూకేశారు. ఇద్దరు మిలిటెంట్లు తమను తాము పేల్చుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక ఉగ్రవాదిని పోలీసు బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం ఉదయం వరకూ కాల్పులు కొనసాగాయి. ఉగ్ర దాడి జరిగిన నాలుగు గంటలకు కాలేజీని భద్రతా బలగాలు ఖాళీ చేయించి గాలింపు జరుపుతున్నారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

 పక్కా ప్రణాళిక ప్రకారమే..
 ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. 165 మందికిపైగా గాయపడ్డారని, వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి జాకెట్లు ధరించారని, వీరు అఫ్గానిస్తాన్‌లోని తమ నేతల నుంచి ఆదేశాలు అందుకుని దాడులు జరిపారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ క్వెట్టా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రైనింగ్ కాలేజీలో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన.. దాడిలో మరణించిన క్యాడెట్ల ఆత్మకు శాంతి చేకూరాలని నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.

పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా క్వెట్టా చేరుకుని తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. కాగా, పోలీస్ ట్రైనింగ్ కాలేజీపై ఉగ్రదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2006లో ఒకసారి.. 2008లో మరోసారి ఇక్కడ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కాగా, ఈ దాడికి ఐసిస్‌తోపాటు తెహ్రీక్-ఏ-తాలిబాన్ , హకీముల్లా ఉగ్రవాద సంస్థలు కూడా ఈ దాడి తామే చేశామని చెప్పుకున్నాయి. అయితే తమ మిలిటెం ట్లు దాడి చేసినట్లు తమకు ఇంకా సమాచారం రాలేదని తెహ్రీక్-ఏ-తాలిబాన్ తెలిపింది. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మూడు రోజుల ను సంతాప దినాలుగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు