జైల్లో మాజీ ప్రధాని.. ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాది

16 Jul, 2018 17:37 IST|Sakshi

లాహోర్‌ : ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ధోరణి మరోసారి బట్టబయలయింది. అవినీతి కేసుల్లో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్‌ చేశామంటూ గొప్పలు చెప్పుకున్న పాక్‌, ఉగ్రవాదుల విషయంలో మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను స్వదేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ ముంబై దాడుల ప్రధాన సూత్రధారుడు, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ విషయంలో మాత్రం పాక్‌ ఇందుకు భిన్న  వైఖరి కనబరుస్తోంది. ఇప్పటికే అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డుతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రసుత్తం జమాత్ ఉద్‌ దవా(జేయూడీ) ఉగ్ర సంస్థకు హఫీజ్‌ అధినేతగా ఉన్నాడు.

మిల్లీ ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌) పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్‌ జూలై 25న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో హఫీజ్‌ కొడుకు, అల్లుడు, 13 మంది మహిళలతో పాటు జేయూడీ ఉగ్ర సంస్థకు చెందిన 265 మంది సభ్యులు ఎంఎంఎల్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాల్లీలో  హఫీజ్‌ పాల్గొంటున్నాడు. ఎంఎంఎల్‌ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో  జేయూడీ ఉగ్ర సంస్థ సీనియర్‌ యాకుబ్‌ షేక్‌ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, ధర్మం ప్రతిపాదికన ఎంఎంఎల్‌ అభ్యర్థులను గెలిపించాలని పాక్‌ ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాక్‌లోని పరిస్థితులను మార్చివేస్తామని అన్నారు. మానవత్వంతో సేవలందిస్తామని, కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తామని తెలిపారు.

ఎంఎంఎల్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా భారత్‌, యూఎస్‌లపై విరుచుకుపడుతున్నారు. అవినీతికి పాల్పడ్డ ఆ దేశ మాజీ ప్రధానిని జైల్లో ఉంచిన పాక్,  ఉగ్ర సంస్థలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా