గాడిదలను చూస్తేనే వణుకుపుడుతోంది

13 Mar, 2018 09:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాబూల్‌ : మానవ బాంబులు, ట్రక్కు బాంబులు... ఇంత కాలం ఇలాంటి ఆత్మాహుతి దాడుల గురించి విని, చదివి ఉన్నాం. కానీ, ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌లో కొత్త తరహా దాడులతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. గాడిదలతో బాంబు దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు భద్రతా సిబ్బందికి వణుకు పుట్టిస్తున్నారు.

గాడిదలకు బాంబులను అమర్చి భద్రతా క్యాంపులపై వాటిని వదులుతారు. నిర్దేశిత లక్ష్యం చేరాక వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో పేలుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. నెల వ్యవధిలో ఇలాంటి దాడులు 5 చోటు చేసుకోగా.. సుమారు 9 మంది(ఐదుగురు సాధారణ పౌరులు) ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెక్‌పోస్టులను దాటేందుకు ఉగ్రవాదులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాడిదలు కనిపిస్తేనే చాలూ అధికారులు వాటిని కాల్చి చంపుతున్నారు. తాజాగా సోమవారం కున్వార్‌ ప్రొవిన్స్‌లో గాడిద బాంబు దాడి చోటు చేసుకోగా.. ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే వీటిని క్రూరమైన చర్యలుగా  జంతు ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీస్తూ వస్తున్న ఉగ్రవాదులు.. తమ లక్ష్యాల కోసం ఇప్పుడు మూగ జీవాలను బలి పెట్టడం దారుణమని పేర్కొంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 2014లో కున్వార్‌ ప్రొవిన్స్‌లోనే ఉగ్రవాదులు ఇలాంటి తరహా దాడులకు పాల్పడిన ఘటనలను ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు