అమెరికా టెక్‌ దిగ్గజాలకే షాకిచ్చాడు!

15 Aug, 2018 11:21 IST|Sakshi

వాషింగ్టన్‌ : టెక్‌ దిగ్గజాలే గంటలు, రోజులపాటు కష్టించి మరీ చేయగలిగిన పనిని ఓ 11 ఏళ్ల విద్యార్థి నిమిషాల వ్యవధిలో చేసి ఔరా అనిపించాడు. ఆ కుర్రాడి ఘనతతో అమెరికా ఓటింగ్‌ సైట్ల సమాచారం భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల డెఫ్‌కాన్‌ సెక్యూరిటీ కన్వెన్షన్‌ పేరిట మూడు రోజులపాటు హ్యాకింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. ఇందులో 6-17 ఏళ్ల మధ్య చిన్నారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. అయితే ఓ 11 ఏళ్ల బాలుడు ఎమ్మెట్‌ బ్రెవర్‌ మాత్రం అచ్చం అమెరికాఎన్నికల ఫలితాల వెబ్‌సైట్‌ లాంటి వెబ్‌సైట్‌నే కేవలం 10 నిమిషాల్లో క్రియేట్‌ చేశాడు. ఫ్లొరిడా రాష్ట్ర ఎన్నికల విజేత పేరును మార్చేశాడు. మరో 5 అమెరికా రాష్ట్రాల ఎన్నికల వెబ్‌సైట్‌లను చిన్నారులు సులువుగా హ్యాక్‌ చేయడంతో అచ్చం అలాంటి వెబ్‌సైట్‌ పేజీలను రూపొందించడం సైబర్‌ విభాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

అసలే ఓవైపు తమ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, అమెరికా ఎన్నికల వెబ్‌సైట్‌లపై నిఘా పెట్టిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు సైతం అమెరికా కీలక వెబ్‌సైట్‌లను తమ నియంత్రంణలోకి తెచ్చుకోవడం, అచ్చం వాటి నకలుగా వెబ్‌సైట్‌లను కేవలం నిమిషాల వ్యవధిలో క్రియేట్‌ చేయడంతో సైబర్‌ నిపుణులు కంగుతిన్నట్లు సమాచారం. అయితే నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్‌ మాత్రం ఈ కన్వెన్షన్‌లో వచ్చిన ఫలితాలను స్వాగతించడం గమనార్హం.

టెక్సాస్‌కు చెందిన ఎమ్మెట్‌ బ్రేవర్‌ ఫ్లొరిడా స్టేట్‌ ఎన్నికల వెబ్‌సైట్‌ డూప్లికేట్‌ను క్రియేట్‌ చేయడంతో పాటు విజేతల పేర్లను మార్చివేశాడు. వారికి వచ్చిన ఓట్ల సంఖ్యను తన ఇష్టరీతిన మార్చివేసి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేశాడు. సైబర్‌ కాంపిటీషన్‌లో బ్రేవర్‌ విజేతగా నిలిచినట్లు మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు