ఆ క్షణం అద్భుతం

19 Jul, 2018 03:56 IST|Sakshi

చియాంగ్‌ రాయ్‌: థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుని 18 రోజుల తర్వాత బయటపడిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాట్‌ కోచ్‌ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇళ్లకు చేరుకున్నారు. ఆస్పత్రి బయట ఈ సందర్భంగా వారు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గుహ నుంచి బయటపడటం ఓ అద్భుతమని పిల్లలు వ్యాఖ్యానించారు. రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో  ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్‌రాయ్‌లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచడం తెల్సిందే.  తొలుత పిల్లలను గురువారం ఇళ్లకు పంపాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే వారిని డిశ్చార్జ్‌ చేశారు.

ప్రస్తుతం అందరు పిల్లలతోపాటు, వారి కోచ్‌ కూడా పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా, ఇళ్లకు వెళ్లాక నెలపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా పిల్లలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేలా చూడాలని వైద్యులు సూచించారు. ఆ గుహలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడగనున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుగానే తెప్పించుకుని, మానసిక వైద్యులకు చూపించి, బాలుర ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదనుకున్న ప్రశ్నలనే అనుమతించారు. పిల్లలు ఇళ్లకు రావడంతో అమితానందంగా ఉందని, ఈ రోజు  ఓ శుభదినమని బాలుర కుటుంబ సభ్యులు చెప్పారు.

మరిన్ని వార్తలు