ఈ రాజు లక్షన్నరమంది ఖైదీలను ఏం చేస్తారో?

13 Dec, 2016 16:39 IST|Sakshi
ఈ రాజు లక్షన్నరమంది ఖైదీలను ఏం చేస్తారో?
బ్యాంకాక్‌: థాయిలాండ్‌ కొత్త రాజు మహా వజ్రలాంకార్న్‌ దయామయుడిగా మారబోతున్నారు. ఆయన దాదాపు లక్షన్నర మంది నేరస్తులకు క్షమా భిక్ష పెట్టనున్నారు. శిక్షల స్థాయిని తగ్గించడమో, మొత్తానికే రద్దు చేయడమో వంటి చర్యలకు దిగబోతున్నారు. ఈ నేరస్తుల్లో రాజద్రోహానికి పాల్పడిన వారు, అత్యంత కఠినమైన చట్టాల కింద అరెస్టయిన వారు కూడా ఉన్నారు. రాజుగా వజ్రలాంకార్న్‌ ఈ నెల(డిసెంబర్‌) 1న కిరీటం ధరించారు.

తండ్రి భూమిబోల్‌ అదుల్యాదేజ్‌ గత అక్టోబర్‌ 13న కన్నుమూయడంతో ఆయన స్థానంలో రాజుగా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరస్తుల విషయంలో ఆయన ముందుకు వచ్చిన అతిపెద్ద అవకాశం ఇదేనని రాయల్‌ గెజిట్‌ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొత్తం లక్షన్నరమంది ఖైదీల జాబితా సిద్ధంగా ఉందని, వీరు విడుదలకావడమో, లేక శిక్షా కాలాన్ని తగ్గించడమోనన్న నిర్ణయం రాజు చూపించే దయపైనే ఆధారపడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలం, ప్రవర్తన, వయసు ఆధారంగానే రాజు తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపింది. 
>
మరిన్ని వార్తలు