మీ పిల్లలు క్షేమం.. నన్ను క్షమించండి

8 Jul, 2018 01:52 IST|Sakshi
సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది

తల్లిదండ్రులను కోరిన ‘థాయ్‌లాండ్‌’ ఫుట్‌బాల్‌ కోచ్‌

తొలిసారిగా గుహ నుంచి లేఖ రాసిన కోచ్, పిల్లలు

మే సాయ్‌ (థాయ్‌లాండ్‌): గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్‌ జట్టులోని పిల్లల తల్లిదండ్రులకు వారి కోచ్‌ ఎకపోల్‌ ఛంథవాంగ్‌ క్షమాపణలు తెలిపారు. తామంతా క్షేమంగానే ఉన్నామనీ, తమ కుటుంబ సభ్యులు బాధపడకుండా ధైర్యంగా ఉండాలని బాలురు కూడా కోరారు. గుహలో చిక్కుకుపోయిన తర్వాత తొలిసారిగా కోచ్, పిల్లలు కలిసి తల్లిదండ్రులకు లేఖలు రాశారు. ఈ లేఖలను సహాయక బృందంలోని డైవర్లు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ‘బాలుర తల్లిదండ్రులకు నా క్షమాపణలు. పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు.

సహాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు’ అని ఎకపోల్‌ తన లేఖలో పేర్కొన్నారు. మరో బాలుడు రాసిన లేఖలో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేయడం మరచిపోకండి’ అని ఉంది. టున్‌ అనే మరో బాలుడు ‘అమ్మా, నాన్న! దయచేసి బాధపడకండి. నేను బాగున్నా. నేను రాగానే ఫ్రైడ్‌ చికెన్‌ తినడానికి బయటకు వెళదాం’ అని రాశాడు. ఓ ఫుట్‌బాల్‌ జట్టుకు చెందిన 12 మంది బాలురు, కోచ్‌తో కలసి థామ్‌ లువాంగ్‌ గుహలో జూన్‌ 23న సాహసయాత్రకు వెళ్లగా అప్పుడే కురిసిన భారీ వర్షాలకు లోపలే చిక్కుకుపోవడం తెలిసిందే.

ఇప్పటికిప్పుడు తీసుకురాలేం..
పిల్లలందరికీ ఈత సరిగ్గా రాకపోవడం, అదీ గుహలో కావడంతో ఇప్పటికిప్పుడు వారందరినీ నీటి కింద నుంచే బయటకు తీసుకొచ్చే సాహసం ఏదీ చేయబోమని చియాంగ్‌ రాయ్‌ గవర్నర్‌ నరోగ్సక్‌ చెప్పారు. ఇప్పటికే నైపుణ్యవంతుడైన డైవర్‌ నీటి కింద నుంచి వస్తూ చనిపోయాడనీ, పిల్లలను తీసుకురావడం సురక్షితం కాదని ఆయన చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే సహాయక సిబ్బంది గుహ లోపలికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉండదనీ, వర్షాలు తగ్గినందున ఇప్పుడు వారిని కాపాడాలని కొందరు అంటున్నారు.

100కు పైగా రంధ్రాలతో ప్రయత్నం..
కొండకు వందకుపైగా రంధ్రాలు చేసి వారంతా ఎక్కడున్నారో కనిపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల లోతుకు వేసినా పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. గుహలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు