కరోనా: నవజాత శిశువుల కోసం...

9 Apr, 2020 15:29 IST|Sakshi

మాస్కులు ధరించాలి... శానిటైజర్లు వాడాలి... క్వారంటైన్‌లో ఉండాలి... పొడిదగ్గు, జ్వరం ఉంటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి... కరోనా(కోవిడ్‌-19) కాలంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఇవి. పెద్దవాళ్లకు.. నిర్ణీత వయస్సు ఉన్న పిల్లలకు ఫేస్‌మాస్కులు, హ్యాండ్‌వాష్‌ల వంటివి  అందుబాటులో ఉంటాయి. కానీ నవజాత శిశువులకు వీటిని ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే కరోనా మహమ్మారి వలన తొలుత వృద్ధులకే పెను ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న తరుణంలో యువత, అప్పుడే పుట్టిన పసిపాపలు కూడా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి వాతావరణం, అక్కడ ఉన్న సిబ్బంది.. అంతేగాకుండా తల్లి నుంచి కూడా శిశువులకు కూడా కరోనా సోకే అవకాశం ఉంది. (కరోనా: ‘ఆ డ్రగ్‌ తనకు పనిచేయలేదు’)

ఈ నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఆస్పత్రి యాజమాన్యం అప్పుడే జన్మించిన పాపాయిల కోసం కొత్త రకం ‘మాస్కులు’(ఫేస్‌ షీల్డ్‌) తయారుచేసింది. సౌమత్‌ ప్రకామ్‌ ప్రావిన్స్‌కు చెందిన పాలో ఆస్పత్రి వీటిని రూపొందించింది. ‘‘ఫేస్‌ షీల్డ్‌తో.. మా చిన్నారి స్నేహితులకు మరింత రక్షణ కల్పిస్తున్నాం. సో క్యూట్‌ కదా!. తల్లిదండ్రులందరికీ అభినందనలు’’ అంటూ ఫేస్‌బుక్‌ పేజీలో ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యం, వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారుల కోసం మీరు తయారు చేసిన మాస్కులు ఎంతో అందంగా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నాయి. కాగా కరోనాను కట్టడి చేసేందుకు థాయ్‌ల్యాండ్‌లో ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటివరకు దాదాపు 2300 మంది ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు.(కరోనాతో 14 నెలల చిన్నారి మృతి)

మరిన్ని వార్తలు