తీర్పు చెప్పి.. తుపాకీతో..

6 Oct, 2019 03:52 IST|Sakshi

థాయ్‌ జడ్జి ఆత్మహత్యాయత్నం

హత్యాకేసులో తీర్పు ఇచ్చాక తుపాకీతో షూట్‌ చేసుకున్న జడ్జి

అంతకుముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లో న్యాయవ్యవస్థపై నిప్పులు చెరిగిన జడ్జి

బ్యాంకాక్‌: అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తి థాయ్‌లాండ్‌ న్యాయవ్యవస్థలో అడుగడుగునా వచ్చే అడ్డంకుల్ని సహించలేకపోయారు. కిక్కిరిసిపోయిన కోర్టు హాలు సాక్షిగా దేశ న్యాయవ్యవస్థలో లోటుపాట్లను చీల్చి చెండాడుతూ తనని తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఉగ్రవాదం వెర్రి తలలు వేసే దక్షిణ థాయ్‌లాండ్‌లోని యాలా కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కనకోర్న్‌ పియాన్‌చన ఒక హత్యా కేసులో నిందితుల్ని నిర్దోషులుగా తీర్పు చెప్పిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లో న్యాయవ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

ఆ తర్వాత తన దగ్గరున్న తుపాకీతో ఛాతీలో కాల్చుకున్నారు. వెంటనే కోర్టు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి ఛాతీలో దిగిన గుళ్లను బయటకు తీశారు.  ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యాయమూర్తి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. థాయ్‌ సమాజంలో ధనబలం, కండబలం ఉన్నవారికి కోర్టులు అనుకూలంగా ఉంటాయని, సాధారణ పౌరులైతే చిన్నా చితక నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి.

అయితే ఒక న్యాయమూర్తి ఇలా వ్యవస్థను నిందించడం ఇదే తొలిసారి. ఒక హత్య కేసులో ముస్లింలైన అయిదుగురు నిందితుల్ని విముక్తుల్ని చేస్తూ తీర్పు చెప్పిన పియాన్‌చన న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ‘ఎవరికైనా శిక్ష విధించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. అలా లేవని అనిపిస్తే వారిని విముక్తిల్ని చేయాలి. ఒక నిర్దోషికి ఎన్నడూ శిక్షపడకూడదు. వారిని బలిపశువుల్ని చేయకూడదు‘‘ అని అన్నారు.

ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన ఆ అయిదుగురికి శిక్షలు వేయాలంటూ పియాన్‌చనపై ఒత్తిళ్లు వచ్చాయని, సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష విధించలేని ఆయన తీర్పు చెప్పిన తర్వాత తనని తాను కాల్చుకున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. మరోవైçపు న్యాయశాఖ అధికారులు న్యాయమూర్తి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకు వ్యక్తిగత సమస్యలే కారణమని అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఈ పని చేశారో విచారణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు