ఆ బీచ్‌ 3 నెలలు మూసేస్తున్నారు!

23 May, 2018 20:23 IST|Sakshi

బ్యాంకాక్‌ : ‘తెల్ల ఏనుగుల దేశం’గా గుర్తింపు పొందిన థాయ్‌లాండ్‌ ప్రకృతి అందాలకు నెలవు. మరీ ముఖ్యంగా ఇక్కడి బీచ్‌ల అందాలు వర్ణించడం సాధ్యం కాదు. వాటిలో ప్రధానమైనది ‘మాయ బే’ బీచ్‌, పగడపు దీవులకు పెట్టింది పేరు. అండమాన్‌ సముద్రంలో ఫీఫీ లేహ్‌ ద్వీపంలో ఉన్న ఈ మాయా బే 2000 సంవత్సరంలో లియోనార్డో డి కాప్రియో నటించిన ‘ది బీచ్‌’ సినిమాతో ప్రపంచానికి పరిచయమైంది. తెల్లని ఇసుకతో, వైఢూర్య వర్ణపు నీటితో అందంగా, ఆహ్లాదంగా ఉండే ఈ బీచ్‌కు ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువే.

థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక ఆదాయ వనరుగా బాసిల్లుతున్న ఈ బీచ్‌ను మూడు నెలల పాటు మూసివేయనున్నట్లు థాయ్‌లాండ్‌ పర్యావరణ శాఖ ప్రకటించింది. పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో కొన్నాళ్ల పాటు ఈ బీచ్‌ను మూసివేయాలని భావిస్తున్నట్లు థాయ్‌లాండ్‌ పర్యాటక శాఖ డైరెక్టరు కనోక్కిట్టిక క్రిత్వుటికాన్‌ తెలిపారు. ‘అరుదైన ప్రకృతి సంపదను కాపాడుకోవడం మా బాధ్యత. మాయ బే ప్రకృతి అందానికే కాక స్పీడ్‌ బోటింగ్‌, ఫెర్రారి డ్రైవ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ బీచ్‌ను సందర్శించడానికి రోజుకు దాదాపు 5000 మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో విపరీతమైన అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో పగడపు దీవులు దెబ్బతిన్నాయి. అవి మళ్లీ మాములు పరిస్థితికి రావాలనే ఉద్ధేశంతో 2018, జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు దాదాపు మూడు నెలల పాటు బీచ్‌ని మూసివేస్తున్నామ’న్నారు. అంతేకాక పడవలు తిరగకూండా నిషేధం విధించినట్టు తెలిపారు.

దక్షిణాసియాలో దేశాదాయంలో 12శాతం ఆదాయాన్ని కేవలం పర్యాటకం మీదే పొందుతున్న రెండవ దేశంగా థాయ్‌లాండ్‌ గుర్తింపు పొందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ఆ ప్రభావం కాస్తా పర్యావరణం మీద పడింది. 2015లో సైన్స్‌ మేగజీన్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో సముద్ర వ్యర్థాల ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్‌ కూడా ఉందని, దానివల్ల వన్యప్రాణులకు హానీ వాటిల్లుతుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో పర్యావరాణాన్ని కాపాడుకోవాలనే ఉద్ధేశంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచుల్లో పొగ తాగటాన్ని, వ్యర్థాలు పడేయడాన్ని నిషేధించింది.

మరిన్ని వార్తలు