థాయ్‌ యువరాణి ప్రధాని అభ్యర్థిత్వం రద్దు 

10 Feb, 2019 03:12 IST|Sakshi

రాజాజ్ఞతో వెనక్కి తగ్గిన చార్త్‌ పార్టీ 

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ప్రధాని పదవిపై కన్నేసిన యువరాణి ఉబోల్‌ రతనకు చుక్కెదురైంది. తమ ప్రధాని అభ్యర్థిగా ఉబోల్‌ పేరును ఉపసంహరించుకుంటున్నట్లు థాయ్‌ రక్ష చార్త్‌ పార్టీ ప్రకటించింది. రాజకుటుంబీకులు రాజకీయాల్లోకి వెళ్లడం సంప్రదాయానికి వ్యతిరేకమని థాయ్‌లాండ్‌ రాజు మహావజ్రాలంగ్‌కోర్న్‌ శనివారం వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన థాయ్‌ రక్ష చార్త్‌ పార్టీ రాజాజ్ఞను పాటిస్తామని స్పష్టం చేసింది. ఉబోల్‌ రతన శనివారం నిర్వహించే ప్రచార కార్యక్రమాన్ని రద్దుచేసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, రాజు నిర్ణయంతో 2019, మార్చి 24న జరగనున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో జుంటా సైనిక పాలకుల విజయం నల్లేరుపై నడక కానుంది. సైన్యం తిరుగుబాటు చేయడంతో 2006లో థక్సిన్‌ షీనవ్రత, 2014 లో ఆయన సోదరి ఇంగ్లక్‌ షీనవ్రత ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. వీరిద్దరూ ప్రస్తుతం ప్రవాసంలో గడుపుతున్న నేపథ్యంలో షీనవ్రత కుటుంబానికి చెందిన థాయ్‌ రక్ష చార్త్‌ పార్టీ యువరాణి ఉబోల్‌ను తెరపైకి తెచ్చింది.  

మరిన్ని వార్తలు