ఆ గుహ ఇక మ్యూజియం

13 Jul, 2018 02:12 IST|Sakshi

ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రభుత్వం

మే సాయ్‌: వైల్డ్‌బోర్స్‌ సాకర్‌ జట్టుకు చెందిన 12 మంది పిల్లలు, కోచ్‌ చిక్కుకుపోయిన తామ్‌ లువాంగ్‌ గుహలో సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు చియాంగ్‌రాయ్‌ ప్రావిన్సు గవర్నర్‌ నరోంగ్‌సక్‌ తెలిపారు. ఈ ప్రాంతం త్వరలోనే థాయ్‌లాండ్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా నిపుణులు వాడిన పరికరాలు, డైవింగ్‌ సూట్లు, యంత్రాలను సందర్శనకు ఉంచనున్నట్లు నరోంగ్‌సక్‌ తెలిపారు.

ఇక్కడ అమర్చిన భారీ పైపుల్ని, యంత్రాలను దాదాపు 50 మంది సిబ్బంది తొలగిస్తున్నారని, ఈ పనులు ఆదివారం వరకూ కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం గుహలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున లోపల యంత్రాలు ఉన్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డైవర్, అనస్థీషియా నిపుణుడు రిచర్డ్‌ హారిస్‌ లేకుంటే ఈ మిషన్‌ విజయవంతం అయ్యేది కాదన్నారు. గుహలో 13 మంది సజీవంగా ఉన్నట్లు మొట్టమొదట గుర్తించిన బ్రిటిష్‌ డైవర్‌ జాన్‌ వాలంథెన్‌కు థాయ్‌ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.

స్వదేశానికి వెళ్లేందుకు జాన్‌ బుధవారం సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి ప్రజలందరూ లేచినిల్చుని కరతాళ ధ్వనులతో ఆయన్ను సాగనంపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు, నిపుణుల్ని కీర్తిస్తూ పలు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. జూన్‌ 23న తామ్‌ లువాంగ్‌ గుహలోకి వెళ్లిన 13 మంది నీటి ప్రవాహం కారణంగా లోపల చిక్కుకున్నారు.

చివర్లో తప్పిన పెనుముప్పు..
తామ్‌ లువాంగ్‌ గుహలో సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు చివరి నిమిషంలో పెనుప్రమాదాన్ని ఎదుర్కొన్నారని థాయ్‌ నేవీ సీల్స్‌ సీనియర్‌ కమాండర్‌ ఒకరు తెలిపారు. గుహలో చివరి విద్యార్థి, కోచ్‌లను బయటకు తీసుకురాగానే నీటిని బయటకు పంపింగ్‌ చేసే యంత్రాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గుహలో దాదాపు 20 మంది డైవర్లున్నారు. చివరికి పరిస్థితి చేయిదాటకముందే డైవర్లందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని పేర్కొన్నారు. తామ్‌ లువాంగ్‌ ఘటన ఆధారంగా సినిమా తీస్తామని ‘ప్యూర్‌ ఫ్లిక్స్‌’ సంస్థ భాగస్వామి మైఖేల్‌ స్కాట్‌ ఇప్పటికే ప్రకటించారు. 

>
మరిన్ని వార్తలు