గాలి మర ప్లేస్‌లో గాలి మేడ

1 Jul, 2017 02:01 IST|Sakshi
గాలి మర ప్లేస్‌లో గాలి మేడ
యూరప్‌లో నెదర్లాండ్స్‌ అనే ఓ బుల్లి దేశం ఉంది. దశాబ్దాలకు ముందే ఈ దేశం గాలిమరలకు ప్రసిద్ధి. రాటర్‌డామ్‌ నగరంలో ఉండే గాలిమరైతే.. మరీ ఫేమస్‌. ఇప్పుడు దీని స్థానంలోకి వచ్చేస్తోంది.. పక్క ఫొటోల్లో కనిపిస్తున్న సూపర్‌హైటెక్‌ భవనం. చక్రం మాదిరిగా గుండ్రంగా ఉంది.. ఇది భవనమేంటి అనుకోకండి. దాదాపు 570 అడుగుల ఎత్తుండే ఈ భవనంలో అన్నీ హైటెక్‌ హంగులే. పేరు డచ్‌ విండ్‌ వీల్‌! గాలి మర స్థానంలో కడుతున్నామనుకున్నారో ఏమోగానీ.. ఈ భవనం మొత్తాన్ని ఓ గాలిమర మాదిరిగా విద్యుదుత్పత్తికి వాడుకుంటున్నారు.

ఇక వివరాల విషయానికొద్దాం. భవనంలో అపార్ట్‌మెంట్లు మొదలుకొని హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, థియేటర్‌లాంటివి బోలెడు ఉంటాయి. ఇక చక్రం మధ్యలో సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. ఈ భవనంపైకప్పుగా వాడిన పదార్థం సూర్యరశ్మిలో మనకు అవసరమైన వాటిని మాత్రమే లోనికి రానిస్తుంది. అతినీల, పరారుణ కాంతిని వెనక్కు పంపేస్తుంది. ఇక ఈ భవనంపై పడ్డ ప్రతి వాన చినుకునూ భద్రంగా ఒడిసి పట్టేందుకు వాటర్‌ హార్వెస్టింగ్‌ పద్ధతులు అందుబాటులో ఉంచారు. విండ్‌వీల్‌ అడుగున కృత్రిమంగా చిత్తడి నేలలను ఏర్పాటు చేసి.. దాని ద్వారా భవనం నుంచి వెలువడే మురుగునీటిని అక్కడికక్కడే శుద్ధి చేస్తారు.

సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చేస్తారు. ఇక.. డచ్‌ విండ్‌ వీల్‌ను సందర్శించేందుకు వచ్చేవారిని ప్రత్యేకమైన క్యాబిన్‌ల వంటి గదుల్లో భవనం పై అంతస్తు వరకూ తీసుకెళతారు. యోగా చేసుకునేందుకు.. కాళ్లు బార్లా చాపుకుని రిలాక్స్‌ అయ్యేందుకు.. విందు, వినోదాలతో కాలక్షేపం చేసేందుకు.. ఇలా అనేక రకాల క్యాబిన్లు ఉంటాయి. రెండేళ్ల క్రితం డచ్‌ వీల్‌ విండ్‌కు శ్రీకారం పడగా.. ఇటీవలే దీని నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు వచ్చాయి.   
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
మరిన్ని వార్తలు