'ఫ్రంట్ వీల్ లేకుండానే విమానం ల్యాండింగ్'

22 Sep, 2015 18:43 IST|Sakshi
'ఫ్రంట్ వీల్ లేకుండానే విమానం ల్యాండింగ్'

టెహ్రాన్: ఇరాన్కు చెందిన విమానం ఒకటి ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించకపోతే భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి కూడా వచ్చేది. అసలు ఈ విమానం ల్యాండ్ చేసిన తీరే అత్యద్భుతం. ఎందుకంటే ముందు చక్రాలు లేకుండానే ప్రధాన చక్రాల ద్వారా విమానాన్ని దించి పైలెట్లు ఔరా అనిపించారు. ఇరాన్ ఎయిర్ బోయింగ్ 727 విమానం ఒకటి మెహ్రాబాద్ విమానాశ్రయంలో దిగడానికి ముందు విమానం ముందు కొన భాగం గేర్లలో (ఎయిర్ నోస్ గేర్) సమస్య తలెత్తి ఆ చక్రాలు తెరుచుకోలేదు.

దీంతో పైలెట్ ఎంతో పరిణితితో ఆలోచించి ముందు విమానాన్ని వీలయినంత ఎత్తులో ఎగిరేలా చేశారు. అనంతరం ప్రధాన చక్రాల ద్వారా రన్ వేను తాకించి వీలయినంత పైకి విమానం ముందు కొనభాగం పైకెత్తి పట్టుకొని వేగం తగ్గించారు. అలా ముందుకు కదిలిన విమానం ఓ సమయంలో బలంగా నేలను తాకి పల్టీ కొడుతుందా అనేంత భయం కూడా కలిగింది. కానీ నేర్పుతో విమానం బ్యాలెన్స్ మొత్తాన్ని ప్రధాన వీల్స్ పైనే ఉంచి మెల్లిగా నోస్ను తాకించి సురక్షితంగా విమానం ల్యాండ్ చేశారు. దీంతో 94 మంది ప్రయాణీకులు, 19 మంది విమానసిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.