విమానం కన్నా వేగంగా రైలులో...

14 May, 2016 12:41 IST|Sakshi
విమానం కన్నా వేగంగా రైలులో...

లాస్ వెగాస్: విమానంకన్నా వేగంగా రైల్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది. గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో..  విస్మయపరిచే  ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది.

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన  వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది.

హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది.