ప్రజాసేవలో పులకించిన గ్రామం

8 Jan, 2016 00:17 IST|Sakshi
ప్రజాసేవలో పులకించిన గ్రామం

లండన్: సోమర్‌సెట్ కౌంటీలోని కాంగ్రెస్‌బరి ఓ చిన్న గ్రామం. గ్రామ జనాభా 3,500. అందులో 1215లో నిర్మించిన సెయింట్ ఆండ్రూ చర్చికి 2015 నాటికి 800 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా కలసి ఏడాదిపాటు ఎలాంటి ప్రత్యోపకారం ఆశించకుండా ఇరుగుపొరుగు వారికి, అపరిచితులకు మనస్ఫూర్తిగా 800 రకాల సేవలు అందించాలని తీర్మానించుకున్నారు. వార్షికోత్సవం నాటికి ఎవరు, ఏ రకంగా ఇతరులకు సేవలిందించారో వివరిస్తూ ఓ పోస్ట్ కార్డును చర్చివద్దనున్న ఓ బాక్స్‌లో వేయాలని తమకు తామే నిర్ణయించుకున్నారు.
 
ఏడాది తిరిగే సరికల్లా గ్రామరూపురేకలే మారిపోయాయి. అప్పటివరకు ఒకరికొకరు అపరిచితులుగా బతికినవారి ప్రజల మధ్య కొత్తగా ఆత్మీయ సంబంధాలు ఏర్పడ్డాయి. ఏడాది సేవలో భాగంగా కొందరు ఇరుగుపొరుగు ఇళ్లకు రంగులేశారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్ల ప్రహారి గోడలను పునరుద్ధరించారు. కొందరు పక్కింటి కార్లను శుభ్రంగా కడిగిపెట్టారు. మరి కొందరు ఇళ్ల యజమానులకు తెలియకుండానే వారి నల్లా బిల్లులను, పెంపుడు జంతువుల వెటర్నరీ ఆస్పత్రుల బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించారు. కొందరు పడుకునేందుకు సరైన దుప్పట్లు కూడా లేని వారికి వాటిని పంచిపెట్టారు.

పెన్షనర్లకు ఊహించని గిఫ్ట్‌లు కొని పెట్టారు. ఊరికొచ్చిన పొరుగూరి ప్రజలను తమ కార్లలో ఎక్కించుకొని షాపింగ్‌లకు తీసుకెళ్లారు. యువతీ యువకులు వీధులను, పబ్లిక్ పార్కులను  శుభ్రం చేశారు. పార్కుల్లోని బెంచీలకు రంగులు వేశారు.  ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రంగులేసి కొత్త శోభను తీసుకొచ్చారు. ‘స్టార్‌వార్స్: ది ఫోర్స్ అవేకన్స్’ టిక్కెట్లు దొరకని వారికి టిక్కెట్టు కొనిపెట్టారు. పిల్లలకు స్వీట్లు పంచారు. ఇలా ఎవరికి తోచిన సేవలను వారందించారు. క్రిస్మస్ నాటికి గ్రామ ప్రజలు పెట్టుకున్న 800 సేవల లక్ష్యం పూర్తయింది. ఇప్పటికి వారి సేవలు 817కు చేరుకున్నాయి.

ఈ స్వచ్ఛంద సేవల గురించి తెల్సి అక్కడికెళ్లిన మీడియాతోని ప్రజలు తమ అనుభూతులను, మనోభావాలను పంచుకున్నారు. ‘ఏడాదంతా తమకు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఓ పండుగలాగా గడిచిపోయింది. ఎన్నడూ కనీసం మొఖం మొఖం చూసుకోని వాళ్లం కూడా కుటుంబ సభ్యుల్లా కలసిపోయాం. ఆత్మీయతానురాగాలు ఏర్పడ్డాయి. కొత్త బంధాలు చిగురించాయి. చేసిన సాయం చిన్నదైనా పెద్ద మనస్సుతో స్వీకరించాం, ఆనందాన్ని పంచుకున్నాం. మనుషుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే పెద్ద సాయమే చేయక్కర్లేదు. తోటీ మనిషి ఎదురైనప్పుడు ఓ చిరునవ్వు చిందించడం, వీలైతే చేతులు కలిపినా చాలన్న సూత్రాన్ని గ్రహించాం. ఇలాంటి సేవలను ఇంతటితో ఆపకూడదని, మున్ముందు కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాం’ అని గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

బ్రిస్టల్ నగరానికి కేవలం 13 మైళ్ల దూరంలోవున్న కాంగ్రెస్‌బరి గ్రామం ఇప్పుడు బ్రిటన్‌కే ఆదర్శంగా నిలిచింది.

మరిన్ని వార్తలు