అతి పెద్ద విమానం!

21 Mar, 2016 10:29 IST|Sakshi
అతి పెద్ద విమానం!

♦ కొత్త ఫొటోల విడుదల
♦ నేడు ఆవిష్కరణ
♦ త్వరలో ట్రయల్ రన్
 
 లండన్: ప్రపంచంలోనే అతి పొడవైన విమానం కొత్త ఫొటోలను ఆదివారం విడుదల చేశారు. ఎయిర్‌లాండర్ 10 అనే ఈ విమానాన్ని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో సోమవారం ఆవిష్కరించనున్నారు. త్వరలో  ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. 92 మీటర్ల పొడవుతో ఉండే ఈ విమానం అతిపెద్ద ప్యాసింజర్ జెట్‌ల కన్నా 15 మీటర్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్(హెచ్‌ఏవీ) రూపొందించిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 3 వారాలపాటు విహరించడానికి అవసరమైన హీలియం ఇంధనాన్ని నింపుకోవచ్చు. 26 మీటర్ల ఎత్తు, 44 మీటర్ల వెడల్పుతో ఉంటుంది.

గాలి కన్నా బరువుగా ఉండే ఎయిర్‌లాండర్ వివిధ రకాల ఉపరితలాలైన నీరు, మంచుపైనా ల్యాండ్ అవుతుందని స్కై న్యూస్ పేర్కొంది. 2009లో దీన్ని మొదటిసారి అమెరికా కోసం తయారుచేశారు. నిఘా, కమ్యూనికేషన్స్, కార్గో, సహాయక సామగ్రి పంపిణీతోపాటు ప్రయాణికుల రవాణకూ ఇది అనువుగా ఉంటుందని హెచ్‌ఏవీ చెప్పింది. 50 టన్నుల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది. 92 ఎంపీహెచ్ వేగంతో నడిచే వెస్సెల్ ఉందని, ఇది కాలుష్యాన్ని విడుదల చేయదని పేర్కొంది  2018 నాటికల్లా 12 ఎయిర్‌లాండర్‌లను తయారుచేసే అవకాశముంది. ఇందులో 48 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు.

మరిన్ని వార్తలు