ప్రపంచంలోనే పలుచనైన లాప్‌టాప్!

11 Apr, 2016 12:33 IST|Sakshi
ప్రపంచంలోనే పలుచనైన లాప్‌టాప్!

న్యూయార్క్: ప్రపంచంలోకెల్లా అత్యంత పలుచనైన లాప్‌టాప్‌ను హెచ్‌పీ కంపెనీ బుధవారం అమెరికాలో ఆవిష్కరించింది. కేవలం 10.4 మిల్లీ మీటర్ల మందం,1.11 కిలోల బరువుగల ఈ లాప్‌టాప్‌కు స్పెక్టర్ 13 అల్ట్రాబుక్‌గా నామకరణం చేశామని, ఆపిల్ 13 మ్యాక్‌బుక్ ఎయిర్‌కన్నా, త్రిబుల్ ఏ బ్యాటరీలకన్నా ఇది పలుచగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

1080 పిక్సల్స్ డిస్‌ప్లే కలిగిన ఈ లాప్‌టాప్‌లో 8జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్, 10 గంటల బ్యాటరీ సామర్థ్యంతోపాటు ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఉన్నాయని హెచ్‌పీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మైక్ నాష్ తెలిపారు. అల్యూమినియంతో చేసిన బాడీ ముదురు బూడిదరంగులో, అంచులు ఇత్తడితో ఉండి లగ్జరీ లుక్‌తో కనిపిస్తుందని వివరించారు. అమెరికాలో వీటి అమ్మకాల బుకింగ్‌ను ఏప్రిల్ 25 తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని, మే నెలలో డెలవరి చేస్తామని, ధర దాదాపు 80 వేల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు.

బ్రిటన్‌లో మాత్రం జూలై నెలలో అమ్మకాలను ప్రారంభిస్తామని, అక్కడ ధర మాత్రం లక్షా పది వేల రూపాయల నుంచి మొదలవుతుందని మైక్ తెలిపారు. స్థలం కలసి రావడం కోసం బ్యాటరీ చిన్న, పలుచనైనా పలుకలుగా ఉంటుందని అన్నారు.

ఇందులో సంగీత ప్రియుల కోసం ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని, సౌండ్ వినసొంపుగా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంగ్ అండ్ ఒలుఫ్‌సేన్ సహకారం తీసుకున్నామని మైక్ తెలిపారు. వేడిని ఎప్పటికప్పుడు బయటకు పంపించేందుకు రెండు ఫ్యాన్లు ఉంటాయని, వేడిని పంపేందుకు ప్రాసెసర్‌కు హీట్ పైప్ అనుసంధానించి ఉంటుందని చెప్పారు. ఈ ల్యాప్‌టాప్ అత్యంత పలుచగా ఉన్నప్పటికీ మ్యాక్‌బుక్‌లాగా ఏ విషయంలోను రాజీ పడలేదని, యూఎస్‌బీ-సీ పోర్ట్స్‌తోపాటు హెడ్‌ఫోన్ జాక్ ఉంటుందని, డీప్ కీ బోర్డును కూడా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు