హిందూ రాజ్యంగా మార్చడానికే..

25 Mar, 2017 00:56 IST|Sakshi
హిందూ రాజ్యంగా మార్చడానికే..

యూపీ సీఎంగా ఆదిత్యనాథ్‌ ఎంపికపై న్యూయార్క్‌ టైమ్స్‌ విమర్శలు

న్యూయార్క్‌: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను నియమించడం పట్ల అమెరికా పత్రిక ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ విస్మయం వ్యక్తం చేసింది. లౌకిక భారత్‌ను హిందూ దేశంగా మార్చివేయడంలో తమకు ఎదురులేదని బీజేపీ భావిస్తున్నట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని శుక్రవారం నాటి తన ఎడిటోరియల్‌ ‘హిందూ అతివాదులతో మోదీ ప్రమాదకర ఆలింగనం(మోదీస్‌ పెరిలస్‌ ఎంబ్రేస్‌ ఆఫ్‌ హిందూ ఎక్స్‌ట్రిమిస్ట్స్‌)’లో తీవ్రంగా విమర్శించింది. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచాక మోదీ ఓ వైపు హిందుత్వ అతివాదులను బుజ్జగిస్తూ, మరోవైపు ఆర్థిక వృద్ధి లాంటి లౌకిక లక్ష్యాలపై మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరించారంది.

ముస్లిం మైనారిటీలపై హింసను ఆయన బహిరంగంగా సమర్థించలేదని పేర్కొంది. అయితే యూపీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత మోదీ అసలు రంగు బయటపడిందని, ఆ రాష్ట్రానికి సీఎంగా ఆదిత్యనాథ్‌ను ప్రకటించడం మైనారిటీలను షాక్‌కు గురిచేసే పరిణామమని వెల్లడించింది. ఆదిత్యనాథ్‌ ముస్లింలను దెయ్యాలుగా చూపుతూ రాజకీయంగా ఎదిగారని, 2015లో బీఫ్‌ తిన్నదన్న అనుమానంతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేసిన హిందూ మూకలకు ఆయన మద్దతిచ్చారని తెలిపింది.  యోగా చేసే సమయంలో సూర్య నమస్కారాలకు నిరాకరించిన ముస్లింలు సముద్రంలో మునగాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని  ప్రస్తావించింది. అయితే, ఆదిత్యనాథ్‌ సీఎం కావడాన్ని విమర్శించడానికి న్యూయార్క్‌ టైమ్స్‌కు ఉన్న అవగాహన ఏపాటిదని భారత్‌ తిప్పికొట్టింది.

మరిన్ని వార్తలు