బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం

19 Apr, 2016 02:40 IST|Sakshi
బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం

అధ్యక్షురాలు దిల్మా  అభిశంసనకు కాంగ్రెస్ దిగువసభ తీర్మానం
 
 బ్రసీలియా: లాటిన్ అమెరికాలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అభిశంసనకు మెజారిటీ ప్రజాప్రతినిధులు ఆదివారం ఆమోదం తెలపటంతో సంక్షోభం తలెత్తింది. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభలో 513 మంది సభ్యులు ఉండగా.. అధ్యక్షురాలి అభిశంసన తీర్మానానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది. దీంతో ప్రతిపక్ష సభ్యులు సంబరాలు చేసుకోగా.. దిల్మా మిత్రపక్షాలు ఆగ్రహంగా ప్రతిస్పందించాయి.

అధ్యక్షురాలిపై అభిశంసన చేపట్టాలా లేదా అన్న నిర్ణయం ఎగువ సభ అయిన సెనేట్ చేతుల్లో ఉంది. సెనేట్ అభిశంసనకే నిర్ణయం తీసుకున్నట్లయితే.. ఇటీవల దిల్మాతో విభేదించి ఆమెకు కీలక ప్రత్యర్థిగా మారిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టేమర్ అధ్యక్ష పగ్గాలు చేపడతారు. అధ్యక్షురాలు బడ్జెట్ అంకెలను అక్రమంగా వక్రీకరించారన్న ఆరోపణలను రుజువు చేయకుండానే అభిశంసనకు ఓటు వేయటం ద్వారా ప్రతిపక్ష నేతలు తీవ్ర నేరానికి పాల్పడ్డారని  అధికార కూటమి ఆరోపించింది. దేశంలో 30 ఏళ్ల ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తింది. దిల్మా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అధికారికంగా ప్రతిస్పం దిస్తారని ఆమె అటార్నీ జనరల్ ఎడ్యురాడో కార్డోజో పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో రియో డి జెనీరియోలో ఒలింపిక్ క్రీడలు జరగాల్సి ఉండగా బ్రెజిల్ రాజకీయ సంక్షోభంలో చిక్కకుంది.

మరిన్ని వార్తలు