హైపర్‌లూప్‌ ఇక యూరప్‌లో

3 Feb, 2017 09:49 IST|Sakshi
హైపర్‌లూప్‌ ఇక యూరప్‌లో

పారిస్‌: అత్యంత వేగవంతమైన ప్రయాణానికి మానవుడి అద్భుత సృష్టిగా భావిస్తున్న హైపర్‌లూప్‌ రైల్వే ప్రాజెక్ట్‌ ఇప్పుడు యూరప్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌, కెనడా, రష్యాలలో హైపర్‌లూప్‌ టెక్నాలజీతో రైలు మార్గాల ఏర్పాటుకు ప్రాజెక్టులు ప్రారంభించగా.. ఇటీవల చెక్‌ రిపబ్లిక్‌లోని బ్రునో నుంచి‌, స్లొవేకియా రాజధాని బ్రాస్టిస్లావా వరకు హైపర్‌లూప్‌ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు హెచ్‌టీటీ(హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాటజీ) ఒప్పందం కుదుర్చుకుంది.

యూరప్‌లో హైపర్‌లూప్‌ ప్రాజెక్టును విస్తరించేందుకు ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు హెచ్‌టీటీ వెల్లడించింది. యూరోపియన్‌ ఎరోస్పేస్‌ ఇండస్ట్రీకి టౌలౌస్‌ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఉన్న విషయం తెలసిందే. ఇక్కడ నుంచి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సెంట్రల్ యూరోపియన్‌ లైన్‌లో తమ సేవల విస్తరణకు అనుకూలంగా ఉంటుందని హెచ్టీటీ భావిస్తోంది.

ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన మార్గం గుండా.. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి హైపర్‌లూప్‌ రైళ్లలో వీలుంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో.. 'ద ట్రైన్‌ ఆఫ్ ద ఫ్యూచర్‌'గా హైపర్‌లూప్‌ను పేర్కొంటున్నారు.
చదవండి: హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ?

మరిన్ని వార్తలు