గెలుపుకోసం పిల్లలను ఈడ్చుకెళ్లడానికైనా రెడీ..

7 Apr, 2016 10:29 IST|Sakshi
గెలుపుకోసం పిల్లలను ఈడ్చుకెళ్లడానికైనా రెడీ..

లిన్జ్(ఆస్ట్రేలియా): పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా చదువు, ఆటలు లాంటి విషయాల్లో తమ పిల్లలే ఎప్పుడూ ముందు ఉండాలనుకుంటారు. అయితే పోటీల్లో వాళ్లకు కూడా అవకాశం దొరికితే పిల్లలను గెలిపించడానికి ఎంత దూరం వెళతారో ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది.

ఆస్ట్రేలియాలోని లిన్జ్‌లో 40 మీటర్ల పరుగు పందెంను నిర్వహించారు. వీటిలో 3 నుంచి 5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలతో పాటూ తల్లిదండ్రులు కూడా వారికి సహాయం చేయడానికి పరిగెత్తే అవకాశం కల్పించారు. నిర్వాహకులు ఆటలతో ఆహ్లాదాన్ని, ప్రతి క్షణం ఆనందంగా గడపాలంటూ పోటీలను నిర్వహిస్తే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లాడు రేసులో ముందుండాలని మాత్రమే వీటిలో పాల్గొన్నారు.

మరీ వేగంగా పరిగెత్తే ఓపిక లేక పోయినా తమ తల్లిదండ్రులు ఒంటి చేత్తో లాక్కుంటూ వెళ్లే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పిల్లలు ఏడుస్తున్నా వారిని మొదటి బహుమతి కోసం ఎంతో కఠినంగా ఈడ్చుకుంటూ వెళ్లారు. పరిగెత్తే సమయంలో కొందురు పిల్లలు ఏడిస్తే మరి కొందరు ట్రాక్ పైనే పడిపోయారు. అయినా వారి తల్లిదండ్రులు మాత్రం వారిని ఒంటి చేత్తే ఈడ్చుకుంటూ లైన్ క్రాస్ చేయడానికి ప్రయత్నాలు మాత్రం వదలుకోలేదు.

చిన్నపిల్లలతో ఇలాంటి ఆటలేంటని విమర్శలు వస్తున్నా ఆర్గనైజర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇలాంటి దృశ్యాలు ఇప్పటి వరకు తాము కండక్ట్ చేసిన వాటిలో చాలానే చూశామని చెబుతున్నారు. పిల్లలకు సహాయం చేయమని మాత్రమే తల్లిదండ్రులకు మేము చెప్పామని నిర్వాహకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు