2050 నాటికి 15 కోట్ల మందికి అకాల మరణం

3 Aug, 2017 17:09 IST|Sakshi
2050 నాటికి 15 కోట్ల మందికి అకాల మరణం

న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా ప్రకతి విలయాలు, విపత్తులు సంభవిస్తాయని విన్నాం. వీటి కారణంగా మానవ జాతి నశిస్తుందని కూడా చదివాం. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటుంటూ అమితాశ్చర్యంతో కూడా ఆందోళన కలుగుతుంది. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నది పెరగడమే కాకుండా  వరి, గోధుమ లాంటి పంటల్లో ప్రోటీన్‌లాంటి పౌష్టిక పదార్థాలు లుప్తమవుతాయట. పర్యవసానంగా 2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహారలోపానికి గురై అకాల మత్యువాత పడతారని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలో 76 శాతం మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పంటల్లో ఉండే పౌష్టికాహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వాటిలో పేద దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో సబ్‌ సహారా ఆఫ్రికా దేశాలే ఎక్కువగా భూతాపోన్నతి వల్ల నష్టపోతాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు తెలియజేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడవ వల్ల మొక్కల్లో ఉండే పిండిపదార్థాలు నాశనమై వాటి ఉత్పత్తుల్లో ఐరన్, జింక్‌ లాంటి పోషక విలువలు గణనీయంగా పడిపోతాయని వారు చెబుతున్నారు. భారత్‌ లాంటి దేశంలో వరిలో 7.6 శాతం, గోధుమలో 7.8 శాతం, ఆలుగడ్డలో 6.4 శాతం పోషక విలువలు 2050 సంవత్సరం నాటికి తగ్గిపోతాయని పరిశోధకులు అంచనా వేశారు. వరి, గోధుమలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఈ కారణంగా దెబ్బతింటాయి.

భారత్‌లో ప్రజలు రోజు తీసుకునే ప్రమాణికమైన ఆహారంలో పౌష్టిక విలువలు 5.3 శాతం తగ్గిపోతుందని, ఫలితంగా 5.3 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపం బారిన పడతారని హార్వర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా ప్రజలో రోగనిరోధక శక్తి గణనీయంగా పడిపోవడం వల్ల అకాల మరణాలు సంభవిస్తాయి. వీటిని అరికట్టాలంటే వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను గణనీయంగా తగ్గించాలని, అధిక పోషక విలువలుండే ప్రత్యామ్నాయ ఆహార ంవైపు మొగ్గు చూపాలని, ప్రస్తుత పంటల్లో అధిక పోషక విలువల కోసం కషి చేయాలని వారు సూచిస్తున్నారు. ‘ఎన్నిరాన్‌మెంటల్‌ రీసర్చ్‌ లెటర్స్‌’ పుస్తకంలో ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు