మనసులో మాట కంప్యూటర్ తెరపై..

14 Sep, 2016 00:25 IST|Sakshi
మనసులో మాట కంప్యూటర్ తెరపై..

అమెరికా : ల్యాప్‌టాప్ వైపు తదేకంగా చూస్తున్నారనుకోండి.. అప్పుడు మన మనసులో ఏమనుకున్నా అది ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమైతే.. అక్షరాల రూపంలో మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే.. ఇది సినిమాల్లో జరుగుతుంది కానీ నిజంగా జరగదనుకుంటున్నారు కదా.. ఇప్పుడు ఇది నిజం కాబోతోంది.. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇదంతా నిజంగా జరిగింది. ఓ కోతి తన మనసులో అనుకున్నవన్నీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపించింది. ఇంకో విషయమేంటంటే ఆ కోతికి కాళ్లు, చేతులు పనిచేయవు. మెదడు ఆలోచన తరంగాలను నేరుగా అక్షర రూపంలోకి మార్చడం వల్ల ఇది సాధ్యమైంది.

ఈ అద్భుత సాంకేతికతను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కృష్ణ షెణాయ్ అభివృద్ధి చేశారు. ప్రయోగంలో ఉపయోగించిన కోతి ల్యాప్‌టాప్‌ను ముట్టుకోకుండానే దాని మెదడులోని ఆలోచనలను నిమిషానికి 12 పదాల వేగంతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక, షేక్‌స్పియర్ రాసిన హామ్లెట్‌లోని కొన్ని పేరాలను టైప్ చేయగలిగింది. నోటితో పాటు  కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారికి, కండరాల వ్యాధి కారణంగా అవయవాలను కదల్చలేని వారి కోసం గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే అక్షరాలను టైప్ చేయడం నెమ్మదిగా జరిగేది. పైగా కండరాలను ఎంతో కొంత కదల్చాల్సిన అవసరముండేది. షెణాయ్ అభివృద్ది చేసిన టెక్నాలజీలో ఈ పరిమితులేవీ లేవు. ఇందులో టోపీ లాంటి ప్రత్యేక పరికరం మెదడు సంకేతాలను చదివితే.. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఏర్పాటు చేసిన అక్షరాలపై ఓ కర్సర్ కదులుతూ పదాలను టైప్ చేస్తుంది.

మరిన్ని వార్తలు