అస్తవ్యస్త ఆకాశహర్మ్యం.. యుగ్యోంగ్ హోటల్

6 Aug, 2015 11:37 IST|Sakshi
అస్తవ్యస్త ఆకాశహర్మ్యం.. యుగ్యోంగ్ హోటల్

చరిత్రలోని కొన్ని నిర్ణయాలు ఘోర తప్పిదాలుగా లిఖితమవుతాయి. అవి ఆనాటి పాలకుల అసమర్థతని ఎత్తిచూపుతూ ఉంటాయి. నిరంకుశ ప్రభుత్వంగా పేరున్న ఉత్తర కొరియాను కూడా ఇలాంటి ఓ నిర్ణయమే నవ్వులపాలు చేసింది. ప్రపంచ దేశాల సరసన తలెత్తుకుని గర్వంగా నిలబడాలన్న ఆ దేశ స్వప్నంపై నీళ్లు చల్లింది. ఉత్తర కొరియా అధినాయకత్వాన్ని నేటికీ ఊరిస్తూ, వెక్కిరిస్తోన్న ఆ స్వప్నం మరేదో కాదు. ఓ హోటల్! 'ప్రపంచపు అత్యంత చెత్త భవంతి' అన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న 'యుగ్యోంగ్ హోటల్'!!
 
ఉత్తర కొరియాలోని అత్యంత ఎత్తై భవంతి యుగ్యోంగ్ హోటల్‌ని చూసిన ప్రతిసారీ స్థానికుల గుండెలు మండుతాయి. అంతనీ, ఇంతనీ.. తమను ఎన్నో ఆశలకు గురిచేసి చివరకు ఉసూరుమనిపించిన ఆ కాంక్రీటు గూడును విరగ్గొట్టేయాలనేంత కోపం తన్నుకొస్తుంది వారికి. ఒకటా రెండా.. కోట్లు.. వేల కోట్లు.. ఆహారానికి, విద్యకు, కరెంటుకు, ఆరోగ్యానికి కొట్టుమిట్టాడే దేశంలో 28 ఏళ్ల కిందటే దాదాపు 5 వేల కోట్లు! ఈ భవంతి కోసమే ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేశారు నిరంకుశ ఉత్తర కొరియా పాలకులు. ఇది ఆ దేశ జీడీపీలో 2 శాతానికి సమానం.
 
 నిర్మాణం..
 1987లో యుగ్యోంగ్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. 105 అంతస్తులతో ఎత్తై హోటల్‌గా ప్రపంచ రికార్డు స్థాపన దిశగా అడుగులు వేసింది. తొలుత దీన్ని రెండేళ్లకు అంటే.. 1989 నాటికి పూర్తి చేయాలనుకున్నారు. 330 మీటర్ల ఎత్తై ప్రతిపాదిత భవంతిని ఆ ఏడాది జరిగే 13వ ప్రపంచ యువజన, విద్యార్థి వేడుక సందర్భంగా ప్రారంభించాలని ప్రణాళికలు రచించారు. అయితే నిర్మాణపరమైన కారణాల వల్ల గడువు పెరుగుతూ వచ్చింది. చివరకు 1992లో నిర్ణీత ఎత్తులో నిర్మాణం పూర్తిచేశారు. అయితే, పూర్తిస్థాయి రూపాన్ని తీసుకురాలేకపోయారు. ఇదే సమయంలో సోవియెట్ యూనియన్ కుప్పకూలడంతో ఉత్తర కొరియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేంత సొమ్ము దేశంలో లేకపోవడంతో యుగ్యోంగ్ హోటల్ మొండిగా నిలబడిపోయింది.
 
 చెత్త భవనం..
 ఉత్తర కొరియాలోని ఎత్తై భవనం అనే ప్రచారంతో ప్రపంచ మీడియా దృష్టి ఈ హోటల్‌పై పడింది. పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయి. ఉత్తర కొరియా కలల భవంతిగా పేర్కొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ సంస్థలు దీని గురించి తెలుసుకోసాగాయి. ముఖ్యంగా 1990ల్లో ‘యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రతినిధులు ఆర్థిక సాయం విషయమై ఈ భవంతిని చూసివచ్చారు. అయితే, వీరు చేసిన ప్రచారం ఎక్కడలేని చేటు తెచ్చింది. బాహ్య ఆకారం తప్ప లోపలేమీ లేదని.., కిటికీలు, వైర్లు, పైపులు, ఫర్నిషింగ్, ఫిట్టింగ్.. ఇలా ఏదీ నిర్మించలేదని వారు చెప్పారు. మరమ్మత్తులు చేసేందుకు కూడా వీలులేని భవనం అంటూ తేల్చేశారు. దీంతో ఈ ఆకాశహర్మ్య ఆర్కిటెక్చరల్ ప్లాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని అతి చెత్త బిల్డింగ్ అంటూ బ్రిటిష్ పత్రికలు ప్రచురించాయి. ఇంతటి భారీ నిర్మాణానికి పూనుకున్న ఉత్తర కొరియాలో దానికి సరిపడా ముడిసరకు ఉందా.. అంటూ జపాన్ మీడియా ప్రశ్నించింది.
  పునర్నిర్మాణం..
 తర్వాత 16 ఏళ్ల వరకూ ఈ ఆకాశహర్మ్యం జోలికి ఎవరూ వెళ్లలేదు. 2008, ఏప్రిల్‌లో ఈజిప్టు కంపెనీ ఒరాస్కామ్ గ్రూపు తమ మొబైల్ ఫోన్ నెట్వర్క్‌ను నిర్వహించడానికి ‘యుగ్యోంగ్ హోటల్’ను అనువైనదిగా భావించింది. దీని నిర్మాణం పూర్తి చేసి, తమ 3జీ సేవలను ప్రారంభిస్తామంటూ ఉత్తర కొరియా ప్రభుత్వంతో 400 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కొత్త ఆశలు తెచ్చుకొన్న ఉత్తర కొరియా అధికారులు 2012 నాటికి తమ దేశ శాశ్వత అధ్యక్షుడు 'కిమ్ సంగ్'వందో జయంతి సందర్భంగా హోటల్‌ను ప్రారంభిస్తామంటూ ప్రకటించారు. 2012 నాటికి ఈ భవన బాహ్య నిర్మాణం పూర్తయింది. ఆపాదమస్తకమూ అద్దాలను బిగించిన ఒరాస్కామ్ కంపెనీ దీన్ని జిగేల్‌మనిపించింది. పనిలో పనిగా తమ టెలికమ్యూనికేషన్ యాంటెన్నాలనూ అమర్చింది.
మేడిపండు..
ఈ భవంతి పూర్తయిందంటూ చెప్పుకొంటున్నప్పటికీ లోపలి నిర్మాణం జరగలేదని 2012లో బయటకు వచ్చిన ఫొటోలు తేల్చాయి. చైనాకు చెందిన కోర్యో టూర్స్ కంపెనీ ఈ చిత్రాలను బయటపెట్టింది. వీటిని చూసి డైలీ మెయిల్ లాంటి మీడియా సంస్థలు 'కార్ పార్కింగ్ షెడ్'గా విమర్శించాయి. ప్రతిష్ట కోసం గొప్పలకు పోయిన ఉత్తర కొరియా ప్రభుత్వం చేతులు కాల్చుకుందంటూ ఎద్దేవా చేశాయి. బాహ్య చిత్రాలు చూసి 2012లో వ్యాపారానికి ముందుకొచ్చిన అంతర్జాతీయ హోటల్ దిగ్గజం 'కెంపిన్స్‌కీ' కొద్ది రోజులకే ఆ ఆలోచనను విరమించుకుంది.
పోటీ కోసమా..?
 ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రత్యర్థి దేశాలతో పోటీ కోసమే ఈ భవన నిర్మాణానికి ఉత్తర కొరియా పూనుకుందనే ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్‌లోని 'వెస్టిన్ స్టామ్‌ఫోర్డ్' ప్రపంచంలోని అత్యంత ఎత్తై హోటల్‌గా ఖ్యాతి గడించడంతో దాన్ని అధిగమించే స్థాయిలో ఈ ఆకాశహర్మ్యానికి రూపకల్పన జరిగిందని చెబుతారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తే ఈ ఘనతతో పాటు ప్రపంచ ఏడో ఎత్తై నిర్మాణంగానూ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కేదీ హోటల్!!

మరిన్ని వార్తలు