ఉత్కంఠ రేపిన 'రోప్ వాక్' వెడ్డింగ్!

28 Jul, 2016 15:27 IST|Sakshi
ఉత్కంఠ రేపిన 'రోప్ వాక్' వెడ్డింగ్!

ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంటూ పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేసేవారిని వర్ణిస్తుంటాం. అలాగే అందరికీ భిన్నంగా, కాస్తంత వెరైటీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని తహతహలాడేవారినీ చూస్తాం. కానీ జీవనాధారం కోసం ప్రాణాలతో చెలగాటమాడే సర్కస్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే సర్కస్ ఫీట్ తో పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు చరిత్రను సృష్టించింది. ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో.. తాడుపై నడిచే రోప్ వాక్ ఫీట్ చేస్తూ..  పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు..  ఆ రోప్ వాక్ వెడ్డింగ్ అతిథుల్లో ఉత్కంఠను కూడా రేపింది.  

సర్కస్ లో రోప్ వాక్ చేస్తూనే... వినూత్నంగా వివాహ వేడుకను నిర్వహించుకున్నారు హోస్టన్ కు చెందిన ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు. ప్రపంచ ప్రఖ్యాత సర్కస్ రింగ్లింగ్ బ్రోస్ లో పనిచేసే ఆ ఇద్దరూ భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో గట్టిగా కట్టిన తాడుపై నడుస్తూ దంపతులయ్యారు. 1884 లో అమెరికాలో మొత్తం ఏడుగురు రింగ్లింగ్ సోదరుల్లో ఐదుగురితో ప్రారంభమైన ఈ ప్రముఖ సర్కస్.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ షో గా  ప్రఖ్యాతి పొందింది.  అటువంటి రింగ్లింగ్ బ్రోస్, బార్నమ్ అండ్ బైలీ స్థానిక ఎన్ఆర్జీ స్టేడియంలో  సంయుక్తంగా నిర్వహించిన సర్కస్ షోలో.. అందులోనే పనిచేచే ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు తమ వివాహాన్నినిర్వహించుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.

వైట్ టెక్సిడో కోట్ ధరించి, ఒంటెపై ఊరేగుతూ వివాహ వేదికకు  వచ్చిన వరుడు.. పక్కనే ఉన్న నిచ్చెన మీదుగా అప్పటికే సిద్ధంగా ఉన్న సర్కస్ వాక్ రోప్ మీదకు చేరుకున్నాడు. తెల్లని ఆకట్టుకునే అందమైన పెళ్ళి గౌను, హైహీల్స్ వేసుకొని గుర్రంపై వచ్చిన వధువు.. సైతం సర్కస్ రోప్ పైకి చేరుకున్న అనంతరం.. రోప్ మధ్య భాగంలో కూర్చొని వధూవరులు ఉంగరాలు మార్చుకొని, అతిథుల ఆనందోత్సాహాలు, హర్షధ్వానాలమధ్య ఒక్కటయ్యారు. పెళ్ళికి హాజరైనవారిని చిరుమందహాసంతో పలుకరిస్తూ ఏడడుగులూ నడిచారు.

>
మరిన్ని వార్తలు