అగ్రరాజ్యం అందులో వెనుకబడే ఉందట..!

20 Nov, 2015 16:49 IST|Sakshi
అగ్రరాజ్యం అందులో వెనుకబడే ఉందట..!

స్వేచ్ఛా సమానత్వాల్లో అగ్రరాజ్యం వెనుకబడే ఉందట. స్త్రీలను ఉద్ధరిస్తున్నామని తెగ పోజులు కొట్టే దేశాల్లో ఒకటైన ఆమెరికా అంతర్జాతీయ ర్యాంకింగ్ ను బట్టి చూస్తే మహిళల పట్ల వివక్షను చూపడంలో ముందుందని లెక్కలు చెప్తున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో సమానత్వ చట్టాలు వచ్చి ఏళ్ళు గడిచినా...అవి ఎక్కువ కాలం నిలిచే అవకాశాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి చట్టాలను, సంస్కృతిని సైతం మార్కెట్ శక్తులే నిర్దేశిస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేసిన 145 దేశాల సమగ్ర అంతర్జాతీయ ర్యాంకింగ్ ప్రకారం వివక్షత ప్రదర్శించడంలోనూ ఆమెరికా అగ్రభాగానే నిలవడం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించింది.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లెక్కలను బట్టి  ప్రపంచంలోని 28 దేశాలతో పోలిస్తే అమెరికా లింగ వివక్ష విషయంలో చివరి స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. కేవలం క్యూబా కు తర్వాత, మొజాబిక్ కు ముందు అమెరికా చేరినట్లు తెలుసుకున్నారు.   ప్రసిద్ధ జెనీవా ఆధారిత సంస్థ...  దావోస్ లో  జరిగిన  తమ వార్షిక బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఈ  వివరాలను వెల్లడించింది. ఆర్థిక, రాజకీయ సాధికారతల్లోనూ, విద్యాప్రాప్తి, ఆరోగ్య చర్యల విషయంలోనూ పదేళ్ళుగా మహిళలు, పురుషుల మధ్య కొనసాగుతున్న అంతరాలపై అందుబాటులో ఉన్న లెక్కలను సంస్థ  పరిశీలించింది. మంత్రి వర్గ స్థాయిలో ఉద్యోగులుగా ఉన్న మహిళల సంఖ్య కూడ 32 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని, రాజకీయాల్లో పాల్గొనే మహిళల శాతం ఎక్కువగానే ఉన్నా... లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో విధానాలు సహకరించకపోవడం దురదుష్టకరంగా మారినట్లు ప్రస్తుత పరిశోధనలు తెలుపుతున్నాయి. మహిళలు, పురుషుల మధ్య వేతనాల్లో కూడ అత్యంత వ్యత్యాసం కనిపిస్తోందని లెక్కలు చెప్తున్నాయి.

మహిళలకు ఆర్థిక అవకాశాలు అందించే కొన్ని దేశాల్లో ఆమెరికా కొంతవరకు ముందున్నట్లు కనిపిస్తున్నా...  ర్యాంకింగ్ లో మాత్రం వ్యత్యాసం అధికంగానే  ఉంది. అయితే మిగిలిన ఎన్నో దేశాలు పురుషులకంటే మహిళలకు..తక్కువ అవకాశాలు ఇవ్వడంతో పోలిస్తే ఆమెరికా ముందుందనే చెప్పాలి. అయితే అక్కడ మహిళలు అధిక శాతం శ్రామికులుగానే పనిచేయాల్సి వస్తోంది. పిల్లల సంరక్షణ, సెలవుల విషయంలో మాత్రం యూ.ఎస్ విధానాల్లో ప్రత్యేకత కనిపించడం లేదు. దీంతో చాలామంది మహిళలు వ్యాపార మార్గాలను ఎంచుకోవడమో.. లేదంటే ఇంట్లో కేర్ టేకర్లను పెట్టుకోవడమో చేస్తున్నారని వారి వ్యక్తిగత జీవితాలను పరిశీలించిన సంస్థ తెలిపింది. ప్రపంచంలోని ఏ దేశ నివేదిక పరిశీలించినా... పురుష, స్త్రీ సమానత్వంలో అంతరాన్ని పూరించడానికి కనీసం 118 ఏళ్ళు పట్టొచ్చని ప్రస్తుత నివేదిక అంచనా వేసింది.

సమానత్వంలో ముందున్నామనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత జాన్ గ్రే... మెన్ ఆర్ ఫ్రం మార్స్... ఉమెన్ ఆర్ ఫ్రం వీనస్ అనే పుస్తకాన్ని రాస్తే... 300 పేజీల ఆ పుస్తకం 5 కోట్ల కాపీలు పైగానే అమ్ముడుపోవడమే కాదు... ఇంకా అమ్ముడుపోతూనే ఉంది తప్పించి... ఇప్పటిదాకా ఆ రచయితని మహిళల పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన వారు మాత్రం కనిపించకపోవడం... అగ్రరాజ్యంలో మహిళలపై వివక్షతకు మరోరూపంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సమానత్వంపై బలమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్న యూ.ఎస్., నార్డిక్ దేశాలు వివక్షతను చూపడంలో ముందున్నాయని ప్రస్తుత లెక్కలు చెప్పడం మాత్రం... కాస్త శోచనీయంగానే కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు