మనం కలిస్తే ప్రపంచాన్నే మార్చొచ్చు

27 May, 2016 08:29 IST|Sakshi
మనం కలిస్తే ప్రపంచాన్నే మార్చొచ్చు

* చైనా అధ్యక్షుడితో భేటీలో రాష్ట్రపతి ప్రణబ్
* ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల చర్చలు


బీజింగ్: భారత్, చైనాలు కలసి పనిచేస్తే ప్రపంచ శాంతి, శ్రేయస్సు, అభివృద్ధిలో అద్భుతమైన మార్పులు తేవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గురువారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఆయన చర్చించారు. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో ప్రణబ్‌కు జిన్‌పింగ్ స్వాగతం పలికారు. తన పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహ బంధాన్ని ధృడపరచడంతో పాటు ప్రజల మద్దతు పెరిగేందుకు, సంబంధాల్ని అర్థంచేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.

భారత్, చైనాలు అతిపెద్ద ఆర్థిక దేశాలుగా ఎదుగుతున్నాయని, ప్రపంచ వేదికపై ప్రధాన శక్తులుగా ఉన్నాయని ప్రణబ్ అన్నారు. 125 కోట్ల మంది భారత ప్రజల తరఫున అభినందల్ని తీసుకొచ్చాన ని జిన్‌పిన్‌కు తెలిపారు. ప్రణబ్ ఎంతో అనుభవం గల నేతని, చైనా ప్రజలకు పాత స్నేహితుడని,  ఇరు దేశాల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించేందుకు ఎంతో కాలంగా కట్టుబడి ఉన్నారంటూ జిన్‌పింగ్ ప్రసంశలతో ముంచెత్తారు. భారత్, చైనాలు సంస్కరణలు, అభివృద్ధి పరంగా కీలక దశలో ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు.
 
స్నేహానికి నిబద్ధతతో ఉన్నాం: చైనాతో సంబంధాల బలోపేతానికి ద్వైపాక్షిక నిబద్ధత అవసరమని ప్రణబ్ అన్నారు. పెకింగ్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ చతురత, నాగరితకపై పరిజ్ఞానం ద్వారా సరిహద్దు వివాదం వంటి ఎన్నో సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో భారత-చైనా సంబంధాల బలోపేతానికి 8 అంశాల్ని ప్రణబ్ ప్రస్తావించారు.

ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం విస్తృతంగా రాజకీయ సంప్రదింపులు జరగాలన్నారు. ఇరు దేశాలు ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం పెరిగిందని, విభేదాల్ని ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకున్నాయని ప్రణబ్ చెప్పారు. విద్యారంగంలో సహకారం కోసం భారత్‌కు చెందిన 10 విశ్వవిద్యాలయాలు చైనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు