'చంపాలనుకుంటే చంపేస్తారంతే..'

19 Oct, 2017 10:16 IST|Sakshi

ఇంపాల్‌ : ఉగ్రవాదులకు ప్రత్యేక మత అభిమానం ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. వారు చంపేయాలనుకుంటే చంపేస్తారని, ఉగ్రవాదాన్ని కొనసాగించడమే వారి అభిమతంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ముస్లిం ఉగ్రవాది, క్రైస్తవ ఉగ్రవాది అంటూ ఉండడని, ఏ మతానికి చెందినవారైనా ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఇంపాల్‌లో ఓ రిసెప్షన్‌ పాల్గొన్న సందర్భంగా ఆమన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కూడా విమర్శలు చేశారు.

అమెరికానే తన తొలి ప్రాధాన్యం అనే ట్రంప్‌ నినాదం సరికాదని అన్నారు. హింస పరిష్కారాన్ని చూపెట్టబోదని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మనం సృష్టించుకున్నవేనని అన్నారు. దాదాపు వెయ్యేళ్ల అహింసా చరిత్రను కలిగిన భారతదేశం ప్రపంచ శాంతిని స్థాపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను తమ నియంత్రణలో పెట్టుకోవాలని, ఆగ్రహం ప్రజల రోగ నిరోధక శక్తిని హరిస్తుందని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కూడా హితవు పలికారు.

మరిన్ని వార్తలు