అంతరిక్షంలో వ్యోమగామి వెంటపడ్డ గొరిల్లా

24 Feb, 2016 16:37 IST|Sakshi
అంతరిక్షంలో వ్యోమగామి వెంటపడ్డ గొరిల్లా

అంతరిక్షంలోకి కుక్కలు వెళ్లడం మనకు తెలుసు కానీ ఈమధ్య గొరిల్లాలు కూడా వెళుతున్నాయా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో అవుననే అంటుంది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఓ గొరిల్లా ప్రత్యక్షమవ్వడమే కాదు.. ఏకంగా ఓ వ్యోమగామిని వెంటపడి తరిమింది. అంతరిక్ష కేంద్రంలో ఒక్కసారిగా గొరిల్లాను చూసి కంగుతిన్న ఆ వ్యోమగామి బిత్తరపోవడమే కాదు.. భయంతో పరుగులు కూడా పెట్టాడు. ఇంతకు ఆ గొరిల్లా అంతరిక్ష కేంద్రంలోకి ఎలా వచ్చింది? వ్యోమగామిని ఎందుకు తరిమింది? అంటే దానికి వెనుక మరో వ్యోమగామి చిలిపి పని.. సహచర అంతరిక్ష యాత్రికుడ్రిని టీజ్‌ చేయాలన్న కొంటె ఆలోచన దాగి ఉంది.

అమెరికాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీ అంతరిక్షంలోని ఐఎస్‌ఎస్‌లోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. మార్చి మొదటి వారంలో అతను భూమికి తిరిగి రావాలి. వెళ్లేముందు ఏదో ఒక తుంటరి పని చేసి అంతరిక్ష కేంద్రంలో ఉన్న తన తోటి మిత్రులను ఆటపట్టించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గొరిల్లా అవతారమెత్తాడు. అంతరిక్ష కేంద్రంలోని జీరో గ్రావిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. గొరిల్లా వేషం కట్టిన స్కాట్ కెల్లీ ఒక తెల్ల డబ్బానుంచి బయటకు వచ్చి గాల్లో తేలుతూ బ్రిటిష్ ఆస్ట్రోనాట్ టిమ్ పీక్ వెంటపడ్డాడు.

అతనేమో నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని దాన్నుంచి తప్పించుకునేందుకు తెగ తంటాలు పడ్డాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తోంది. గొరిల్లా సూట్‌ను స్కాట్ సోదరుడు మార్క్ అంతరిక్ష కేంద్రానికి పంపాడు. ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది కూడా అతనే. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీనే.

మరిన్ని వార్తలు